
India England Test series : భారత క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ పర్యటనకు ప్రత్యేక స్థానం ఉంది. 1932లో లార్డ్స్‌లో తొలిసారి టెస్ట్ ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఇంగ్లాండ్‌లో మొత్తం 67 టెస్టులు ఆడి కేవలం 9 విజయాలు మాత్రమే సాధించగలిగింది. కానీ, భారత జట్టు చాలా సార్లు అద్భుతమైన పోరాటం చూపించింది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠను పెంచింది. ఈసారి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు, ఇంగ్లాండ్‌లో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో సిరీస్‌ను గెలిచే లక్ష్యంతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది.
ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు శుభ్‌మన్ గిల్ తీసుకోగా, ఇదే అతడి తొలి టెస్టు సిరీస్. ఇంగ్లాండ్ లో మెరుగైన బ్యాటింగ్ రికార్డులు కలిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టులో లేకుండా టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది. వీరి స్థానంలో యంగ్ బ్యాటర్లకు అవకాశాలు లభించాయి. గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కరుణ్ నాయర్ లు భారత జట్టు టాప్ ఆర్డర్‌కు బలం కానున్నారు.
భారత్ ఇంగ్లాండ్‌లో మొదటిసారి 1971లో టెస్ట్ గెలిచింది. అప్పట్లో భగవత్ చంద్రశేఖర్ 6/38తో ఓవల్ టెస్ట్‌ను భారత్‌కు తెచ్చిపెట్టాడు. తరువాత 1986లో 2-0తో సిరీస్ గెలుపు, 2002లో హెడింగ్‌లేలో ఇన్నింగ్స్ తేడాతో విజయం సంచలనాలు సృష్టించాయి.
భారత్‌కు ఇంగ్లాండ్‌లో ప్రారంభ జోడీలు పెద్దగా విజయవంతం కాలేదు. 1936లో విజయ్ మర్చంట్ - ముస్తాక్ అలీ (584 పరుగులు), 1979లో గవాస్కర్ - చేతన్ చౌహాన్ (453), 2021లో కేఎల్ రాహుల్ - రోహిత్ శర్మ (421) ఉత్తమ జోడీలుగా నిలిచారు.
ప్రస్తుత సిరీస్‌లో జైస్వాల్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేస్తారా లేదా ఇంకెవరైనా ఓపెనింగ్ చేస్తారా అనే నిర్ణయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో తీసుకోనున్నారు. దీని కోసం అప్షన్లుగా సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి ప్లేయర్లు కూడా జాబితాలో ఉన్నారు.
ధృవ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, షార్దూల్ ఠాకూర్ లు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసే అవకాశమున్నవారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా ప్రధాన పాత్ర పోషించనుండగా, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇలాంటి సందర్భాల్లో భారత బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
శుభ్‌మన్ గిల్ స్వయంగా పరుగులు చేయాలి. జట్టులో ఇతర ప్లేయర్లకు ఆదర్శంగా నిలవాలి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గిల్‌పై దీర్ఘకాలిక ఆలోచనలతో కెప్టెన్ గా చేసింది. ఇంగ్లాండ్‌లో జేమ్స్ ఆండర్సన్, స్టూయర్ట్ బ్రాడ్ లాంటి సీనియర్ పేసర్లు లేకపోవడంతో భారత బ్యాటర్లు కొంత ఉపశమనం పొందవచ్చు.
ఈ టెస్టు సిరీస్ లో భారత్ టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేయగలిగితే, ఇంగ్లాండ్‌లో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.