కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగు ఎన్నారైలు అమెరికాలో తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి పనిచేస్తున్న అనుభవం ఎలా ఉందనే విషయాన్ని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న వేణు నక్షత్రం వివరించారు.
కరోనా .. ఇప్పుడు ప్రపంచాన్నివణికిస్తున్నమహమ్మారి. గత డిసెంబర్, జనవరిలో ఈ మహమ్మారి, చైనా- వూహాన్ ప్రజల పై మొదటి సారి విరుచుకు పడ్డప్పుడు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అమెరికాలో నివసిస్తున్న అందరితో పాటు నేను కూడా కొంత కలతపడింది వాస్తవమే. అయినా, భూతల స్వర్గం లాంటి అమెరికాలో జీవిస్తున్న నాలాంటి వారికి "మన దాకా రాదులే, మనకేమి కాదులే" అనే ఒక ధైర్యం ఇచ్చింది ఈ నేల గత రెండు దశాబ్దాలకు పైగా. కానీ క్రమంగా మార్చి నెల వచ్చేటప్పటికీ - కరోనా కి అమెరికా అయినా, చైనా అయినా, ఇటలీ అయినా అన్నీ ఒకటే అని దాని ప్రతాపము చూపింది.
ఆశ్చర్య పడే విషయం, ఇప్పటికీ అర్థం కానీ విషయం: అమెరికాలో నివసించే ఏ ఒక్కరూ జీర్ణించు కోలేని విషయం ఏదన్నా ఉన్నదా అంటే - అది ఈ రోజు ( మార్చి 27) ప్రకారం ప్రపంచంలోనే కరోనా బాధితుల సంఖ్యలో అమెరికా ప్రధమ స్థానంలో ఉంది. మృతులు పదిహేను వందలకు పైగానే, కరోనా బాధితులు లక్షకు పైగానే.
Also Read: ఒంటరి వాళ్లమయ్యామనే ఫీలింగ్: అమెరికా నుంచి తెలుగు మహిళ
undefined
అప్పుడు 2001 ( 911)లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు, హిందువులకి, ముస్లింలకు, సిక్కులకీ తేడా తెలియని అమెరికన్ల దృష్టిలో ప్రతి ఇండియన్ని టెర్రరిస్ట్ లాగే చూసేవారు. ఆ తర్వాత జరిగిన ప్రతీకారజ్వాలల్లో చాలా మంది సిక్కు సోదరులు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కూడా అమెరికన్లు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు నాకు బాగా గుర్తు - రోజూ ఆఫీసులో, రెస్టారెంట్లో కలసి మాట్లాడే తెల్లవారికి, నల్ల వారికి కూడా మేము టెర్రరిస్టులు గా కనపడే వారం. మాతో కలసి లిఫ్ట్ లో , బస్సులో వచ్చేందుకు నిరాకరించేవారు కొందరు. ఆ పరిస్థితి నుండి బయట పడడానికి చాలా రోజులే పట్టింది. చాల మంది ఆసియన్స్ కి 911 కి ముందు , 911 కి తర్వాత అని ఒక చరిత్రలో నిలిచి పోయింది.
సరిగ్గా ఒక దశాబ్దం తర్వాత ఇప్పుడు కరోనా రూపంలో ఒక విపత్తు అందరినీ కబలించింది. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అని చరిత్రలో కరోనా అందరి జీవితాల్లో ఒక చేదు జ్ఞాపకంలా నిలువనుంది. అప్పటి ఆ సంఘటనకి, ఇప్పటి ఈ సమస్యకీ ఎంతో తేడా. అప్పుడు అది మనుషులని వారి రంగును బట్టి విభజిస్తే, ఇప్పుడు ఈ మహమ్మారి అందరినీ ప్రపంచ వ్యాప్తంగా ఏకం చేసింది. ఇప్పుడు రంగు, మతం, దేశం, ప్రాంతం ఏ తేడా లేదు. ఎవ్వరైనా సరే వైరస్ బారిన పడ్డామో.. అంతే మృత్యుగంట మ్రోగుతుంది. కానీ ఈ కష్టకాలంలో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూనే, మీకు ఏ అవసరం వచ్చినా చెప్పండి మేమున్నాం అని ఇంటి పరిసరాల్లో ఉంటున్న అమెరికన్లు అడగటం చాలా సంతోషంగా ఉంది .
ఎన్నో మనసులను యాదృచ్చికంగా దగ్గర చేసింది. ఎందరో ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావ తగ్గిన తర్వాత మనమంతా కలవాలి, కలసి పండుగ చేసుకోవాలి అంటుంటే ఇన్ని రోజులు ఏమి మిస్ అయ్యామో తెలియకనే తెలుస్తుంది. ఏదయినా మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, మనకు దూరం అయినప్పుడే ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు కరోనా రూపంలో మన స్వేచ్ఛ దూరం అయ్యింది, దానికోసం ఎంతమంది ఎన్నిరకాలుగా పరితపిస్తున్నారో చూస్తే ఆ "కోల్పోయిన స్వేచ్ఛ" విలువ తెలుస్తుంది.
రెండు వారాల క్రితం అప్పటికీ ఒక్క కరోనా మృతి కూడా కాకముందే, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు మూసి వేశారు. అయినా దురదృష్టం ఏమిటంటే జరుగబోయే నష్టాన్ని మాత్రం ఆపలేక పోయారు.
ఇంటలీజెన్స్ రిపోర్ట్ ప్రకారం, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, డెమొక్రాట్లు అధికంగా ఉన్న చట్టసభలో ఆమోద ముద్ర పడలేదు. నా దృష్టిలో ఇది ఒక పెద్ద తప్పిదమనిపిస్తుంది. ముందే అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపి వేస్తె చాలా వరకు ఈ కరోనా వ్యాపించకుండా ఉండేదేమో! నేను పాలిటిక్స్ లో అంత నిష్ణాతుణ్ణికాదు కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడలేను, అయినా ఇది రాజకీయ సమస్య కాదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం!
ఇక రాజకీయాలు పక్కకు పెడితే - ఒక్కసారి సియాటెల్-వాషింగ్టన్ లో వైరస్ విజృంభించగానే ప్రభుత్వానికి ప్రజలందరూ పార్టీలకతీతంగా సప్పోర్ట్ గా నిలిచారు. స్వచ్చందంగా ఇళ్లలో ఉంటూ లాక్ డౌన్ పాటించారు, ఇంకా పాటిస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పదునాలుగు రోజుల తర్వాత కానీ పూర్తి లక్షణాలు చూపని కరోనా చాలా మందికి ఈ జబ్బు సోకిందని కూడా తెలియకుండా అందరితో కలిసి తిరుగుతూ ఈ వైరస్ వ్యాప్తికి కారకులయ్యారు. న్యూ యార్క్, శాన్ఫ్రాన్సిస్కో లాంటి సిటీస్ తప్ప అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించారు. కొంత పోలీసు ఫోర్సు తో న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో కూడా లాక్ డౌన్ ప్రకటించక తప్పలేదు.
చాలా హాస్పిటల్స్ లో ఇప్పుడు కరోనా పేషంట్స్ కి వెంటిలేటర్లు , బెడ్డులు కూడా లేవు అన్న విషయం తెలిసినప్పటి నుండి చాలా ఆందోళనగా ఉంది. రోజు రోజుకీ ఈ మహమ్మారి భారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుంటే హాస్పిటల్స్ సరిపోయే పరిస్థితి కనపడడం లేదు. చైనాలో పది రోజుల్లో ఒక హాస్పిటల్ కట్టారు ఇక్కడ అట్లాంటి ఆలోచనలు అయితే ఇంకా ఎవ్వరూ చేయలేదు, ఆలోచిస్తే మాత్రం పరిస్థితి చాలా భయంకరంగానే ఉంది .
ఇండియాలో ఇప్పటికీ కొన్ని మత సంస్థలు మూర్ఖంగా వారి ప్రార్థనలకోసం లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ అలాంటి సమస్య లేదు. అందరూ లాక్ డౌన్ ని సమర్థించే వారే, పోలీసు లాఠీలకు పని చెప్పాల్సిన అవసరం రాలేదు. అయినా ఈ వ్యాధికి ఒక్కసారిగా వేలమంది బలవ్వడం ఇక్కడ నివసిస్తున్న నాతోపాటు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచి వేస్తుంది. అంతవరకూ వాఁట్సాప్ లో కామెడీకే పరిమితం అయిన కరోనా న్యూస్, ఇక్కడ మా వీధుల్లో, మా కౌంటీ ( గ్రామా పంచాయతీ )లో మరణాలు నమోదు కాగానే పరిస్థితి ఒక్కసారి గా వేడిక్కి పోయింది.
ఈ పరిస్థితిలో కొంత మంది తల్లి తండ్రులు, పిల్లలు ఇండ్లలోనే ఇంకా రెండు మూడు నెలలు ఉంటారు, వారిని ఎలా మేనేజ్ చేయాలో అని పిల్లలని " ఒక పెద్ద సమస్యగా" ఊహించుకోవడం నన్ను చాలా బాధ పెట్టిన విషయం. మన పిల్లలని ఎలా పెంచాలో అది మన చేతిలో ఉంది. మనందరమూ అక్కడి నుండే వచ్చాము కదా ! మన పిల్లలని మనం భారంగా భావించడం ఏంటి ?
ఉద్యోగ వత్తిడిలో కొందరు, విందులు వినోదాల్లో కొందరు బిజీగా ఉంటూ తమ పిల్లలతో కనీసం సమయం వెచ్చంచని వారికి, తమ భార్యా బిడ్డలతో గడిపే ఒక మంచి అవకాశం వచ్చింది ఈ లాక్ డౌన్ రూపంలో. అవసరం ఉన్నదానికీ , లేని దానికే ఏదో షాపుకి పోయి ఏదో కొనుక్కొచ్చే అనవసరపు షాపింగ్ తగ్గింది. ఇంటి వంట మరచి పోయిన చాలా ఇండ్లలో ఇప్పుడు వంట చేసుకుని తృప్తిగా తినడం ఒక కొత్త సంకేతం. మెక్డొనాల్డ్, పిజ్జాహట్ లకి అలవాటు అయి అమ్మ చేతి వంట అంటేనే అంత దూరం పరుగెత్తే పిల్లలకి ఇప్పుడు అమ్మచేతి ఆ కమ్మదనం విలువ తెలిసింది. మా ఇంట్లో అయితే "అమ్మా , నాకు పులిహోర పెడతావా ..?" అని పిల్లలు వాళ్ళ అమ్మని అడుగుతుంటే అంతకంటే సంతోషం ఎక్కడుంటుంది ?
ఒకే హాలు లో కూర్చున్నా ఎవరికి ఇష్టమయిన సినిమా వారు ఐపాడ్ లోనో, ఫోన్ లోనూ, కంప్యూటర్ లోనో చూసే రోజుల్నించి , అందరూ కలసి ఒకే టీవీలో ఒకే ఫ్యామిలీ సినిమా చూస్తుంటే, ఈ వైరస్ వస్తే వచ్చింది కానీ ఎన్ని ఫ్యామిలీ విలువలు నేర్పింది అనిపిస్తుంది. ఇంకా తీవ్రంగా ఆలోచిస్తుంటే మనుషులు, ఈ యాంత్రిక జీవనానికి అలవాటు పడి ఎన్ని మానవీయ విలువలకు దూరం అయ్యారో కదా అనిపిస్తుంది.
ఒక సోఫాలో కూర్చుని పిల్లలతో ఒక పుస్తకం చదువుతూ అందులోని మన సంస్కృతిని వారికి చెప్పడంలో ఉన్న సంతృప్తి ఇక్కడనుండి వస్తుంది?
నాతో పాటు చాలా మంది భారతీయులు ఇక్కడ సాఫ్ట్వెర్ రంగంలో ఉన్నారు . దాదాపు అందరికి ఇండ్లలో నుండి పని చేసే ( వర్క్ ఫ్రొం హోమ్ ) వెసులు బాటు ఉంది కాబట్టీ (కొద్దీ మంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారు మినహాయిస్తే), ఉద్యోగం, జీతం సమయానికి రావడం , ఈ కష్ట కాలంలో ఒక మంచి సదుపాయం. ఉద్యోగాలు లేక, ఇంటి అద్దె కట్టుకోలేక, తినడానికి తిండి కూడా లేని కుంటుంబాలు ఎన్నో ఇప్పుడు, వారిని చూస్తే చాలా బాధ కలుగుతుంది, అప్పుడనిపిస్తుంది నేను ఎంత అసృష్టవంతుడినో కదా అని!
ఇప్పుడు అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసిన వారు గతంలో ఎప్పుడూ లేనన్ని దరఖాస్తుల రికార్డుని తిరగరాసింది అంటే ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో కదా ఈ కరోనా మహమ్మారి దాడికి! తక్కువ ఆదాయం ఉన్న ఫ్యామిలీ కి ఒక వెయ్యి డాలర్లు ( రెండు ట్రిలియన్ల) రిలీఫ్ ఫండ్ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. ఈ సహాయం చాలా కుటుంబాలకి ఎంతో ఊరట. అంతే కాకుండా, అన్ని ప్రభుత్వ సంస్థలు మూసివేయబడ్డాయి కాబట్టి , ప్రభుత్వ లైసెన్సులు, పర్మిట్లు, ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ తేదీలు అన్నీ రెండు-మూడు నెలలు పొడిగించడం చాలా మందికి ఊరట కల్గించింది.
చివరగా ఒక మాట :
కరోనా పూర్తిగా తగ్గే వరకు అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. ప్రభుత్వం చెపుతున్న ముందు జాగ్రత్తలు పాటించండి. నివారణ కంటే నిరోధన ఉత్తమం. దురదృష్టం ఏమంటే, ఇప్పటికీ కరోనాకి సరైన నివారణ లేదు. దయచేసి మరొక్క సారి ప్రభుత్వం నుండి వస్తున్న అన్ని జాగ్రత్తలు పాటించండి. విందులు, వినోదాలకి దూరంగా ఉండండి. కుటుంబ సమేతంగా కూర్చుని మంచి సినిమాలు చూడండి, వినోద భరిత షోలు చూడండి. సామాజిక సందేశంతో ఉన్న సినిమాలు పిల్లలతో చూడండి. ఈ ఒక్కసారి, కలిసికట్టుగా కాకుండా విడి విడిగా ఒకరికొకరు దూరంగా ఉండి కరోనా ని జయిద్దాం!
ధన్యవాదములు
మీ వేణు నక్షత్రం
వాషింగ్టన్ డీసీ, యుఎస్ఎ
వర్క్ ఎట్ హోం స్థితిలో మీ అనుభవాలను, ఫీలింగ్స్ ను మాతో పంచుకోండి. కొంత ఊరట లభిస్తుంది. మీ అనుభవాలను pratapreddy@asianetnews.in అనే మెయిల్ కు పంపించండి. లేదా 09848956375 అనే నెంబర్ కు వాట్సప్ చేయండి