కరోనా వైరస్ దెబ్బ: తిరుగు వలస – మరో కోణం

By telugu teamFirst Published Mar 30, 2020, 2:09 PM IST
Highlights

కొలచల చంద్రశేఖర్ అన్న పదవీ విరమణ చేసిన ఏజీ ఆఫీసు ఉద్యోగి ఈ విషయంగా మరో అసక్తికర వాస్తవాన్ని పంచుకున్నారు. పుట్టిన ఊరు వదిలి దేశాలు వెళ్ళిన సామాన్య ప్రజానీకం ఎన్నికల సమయంలో తప్పకుండా స్వగ్రామాలకు రావడాన్ని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వేలాది కిలోమీటర్ల దూరాన్ని లెక్కచేయకుండా జన సామాన్యం స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడంలో మరో ఆసక్తికర కోణం ఉందని కోలచల చంద్రశేఖర్ అంటున్నారు. ముఖ్యంగా ఇది ప్రజా ప్రతినిధులకు భోధపడాలని చెబుతున్నారు.

-కందుకూరి రమేష్ బాబు

 ఒక్క తెలంగాణాలోనే కాదు, గ్రామాలకు తిరిగి కాలి నడకన వెళుతున్న ప్రజల గురించి ఒక వాస్తవిక విషయం మనం పంచుకోవాలి.

పదులు, వేలు కాదు, లక్షలాది జనం తమ స్వస్థలాలకు నడచిపోతున్న విషయం వివిధ మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం కదా! వీళ్ళంతా ప్రధానంగా వలస కార్మికులు. భవన నిర్మాణ కూలీలు.

ఎందుకు తిరుగు వలస ఉన్నదీ అంటే, వారికి ఆ రోజుకే కాదు, మున్ముందు కూడా పని లేకపోవడం ఒక కారణం ఐతే, తినడానికి తిండి లేకపోవడం మరొకటి. అలాగే, ఒకరితో ఒకరు సన్నిహితంగా ముచ్చట పెట్టుకోలేని పరిస్థితి, సోషల్ డిస్టెన్స్ అనివార్యంగా పాటించాల్సి రావడం, పని లేని స్థితిలో అద్దె చెల్లించలేని స్థితి ఏర్పడటం, దానికి తోడు రేషన్ కార్డులపై ఇచ్చే నిత్యావసర సరకుల కోసం ఇంటికి పోవాల్సి రావడం, ఇండ్ల నుంచి రా రమ్మని ఫోన్లు అధికం కావడం - ఇత్యాది కారణాలతో వీరంతా తీవ్ర ఒత్తిడికి లోనై, అనివార్యంగా పిల్లాపాపలతో నడుచుకుంటూ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామాలకు  వెళుతున్నారు.

ఐతే, కొలచల చంద్రశేఖర్ అన్న పదవీ విరమణ చేసిన ఏజీ ఆఫీసు ఉద్యోగి ఈ విషయంగా మరో అసక్తికర వాస్తవాన్ని పంచుకున్నారు. పుట్టిన ఊరు వదిలి దేశాలు వెళ్ళిన సామాన్య ప్రజానీకం ఎన్నికల సమయంలో తప్పకుండా స్వగ్రామాలకు రావడాన్ని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

"ఓటు వేయకపోతే తాము చచ్చి పోయినట్లే అన్న భావన జన సామాన్యంలో ఉన్న విషయం మరచిపోయారా?" అన్నారు. ఆ ఒక్క కారణం వల్లే దేశంలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోందని కూడా గమనించాలని వారన్నారు..

ఓటు వేయకపోతేనే తాము మరణించినట్లే అన్న భావన ఉన్న ప్రజలంతా కరోనా మహామ్మారితో చావు తథ్యం అన్నట్టున్న నేటి పరిస్థితిలో, ఎందుకని స్వగ్రామాలకు వెళ్లరు? అని ప్రశ్నించారాయన. 

"వందలు కాదు, వేల కిలో మీటర్లు అయినా నడిచి వెళతారు" అని చెప్పారాయన. "ఆ చచ్చేదే ఖాయం ఐతే ఇంటి పట్టున పోదాం అని వారు అనుకోవడం సమంజసమే కదా” అన్నారు.

నిజమే. సామాన్య ప్రజల వాస్తవికతలో ఇదొక ముఖ్య కోణం. ఇక్కడే ప్రజాప్రతి నిధుల బాధ్యత కూడా ఉన్నది.

తాము ఎన్నికవడం కోసం ఓటుకు నోట్లను, మందును సైతం ఎరచూపే ప్రజా ప్రతినిధులు సామాన్య జనం మరణం అనివార్యం అనుకునే నేటి స్థితిలో ఇండ్లకు చేరేటప్పుడు అందులోని వాస్తవికతను ఒప్పుకోవలసే ఉంటుంది. వారిని ఇంటికి చేర్చడంలో అవసరమైన చర్యలు ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిందే. అందరి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టి, తిరుగు వలసలో ఉన్న ప్రజలకు సహకరించడం కనీస బాధ్యత. 

ఈ దేశంలోని సామాన్య జనం ఆరేడు దశాబ్దాలుగా ఎన్నికలను ప్రాణప్రదంగా భావించారు. నేడు మొదటిసారిగా వారి ప్రాణాలు ఎన్నికల కన్నా ముఖ్యమని ప్రజా ప్రతినిధులు సైతం గుర్తించక తప్పదు.

(వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు, సామాన్యశాస్త్రం రచయిత)

click me!