జవ‘సత్వాలు’: ఆదాతోపాటు సంస్థల మధ్య సమన్వయమే ‘టాటా’ లక్ష్యం

By ramya NFirst Published Mar 5, 2019, 11:29 AM IST
Highlights


టాటా సన్స్ తన అనుబంధ సంస్థలకు పూర్వ వైభవం తేవడానికి భారీ కసరత్తే చేపడుతోంది. సాల్ట్ టు సాఫ్ట్‌వేర్ వరకు 100కి పైగా సంస్థలు సేవలందిస్తున్నాయి. టెక్నాలజీ, కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులతో వ్యాపారాల్లో సమూల మార్పులు రావడంతో పలు ఇతర గ్రూపులు వాణిజ్యపరంగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ బిజినెస్ లావాదేవీలకు చరమ గీతం పాడి.. సంస్థలను లాభాల బాట పట్టించేందుకు వాటి పునర్వ్యవస్థీకరణ దిశగా చర్యలు చేపడుతోంది. 

టాటా గ్రూపునకు నూతన జవసత్వాలు తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గ్రూపు పరిధిలో 100 వరకు కంపెనీలకు 30 మాత్రమే లిస్టయి ఉన్నాయి. వీటికి అదనంగా 1,000 వరకు అనుబంధ సంస్థలూ కూడా ఉన్నాయి.

భారీ సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఏవో కొన్ని మిగిలినవి అంతగా రాణించడం లేదు. దీంతో టాటా సన్స్ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వంలో గ్రూపు కంపెనీలను 10 సంస్థలుగా వర్గీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ఒకే తరహా వ్యాపారాలు గల సంస్థలు ఓ విభాగం కిందకు తేవాలని, తద్వారా వాటి మధ్య మంచి సమన్వయం తీసుకొచ్చి ఖర్చులను ఆదా చేసుకోవడంతోపాటు సమర్థతను పెంచొచ్చని యాజమాన్యం భావిస్తోంది.

హోల్డింగ్‌ కంపెనీల ప్రతినిధులు ఆయా వెర్టికల్స్‌గా అధిపతిగా వ్యవహరిస్తారు. తద్వారా కంపెనీల మధ్య సమన్వయం పెరిగేలా, కార్యకలాపాలు సాఫీగా నడిచేలా చూస్తారు. టాటా మోటార్స్‌ ఇటీవలే జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వల్ల రూ.3.1 బిలియన్‌ డాలర్లను నష్టం కింద ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ చర్యను చురుకైన, శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి, వేగవంతమైన వృద్ధిని అందుకునేందుకు చేపట్టిందని టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ప్రతి వెర్టికల్‌కు హెడ్‌గా వ్యవహరించే వ్యక్తి ఆ విభాగంలోని కంపెనీల మధ్య సమన్వయ కర్త పాత్రను పోషిస్తారు. ఈ వ్యక్తి టాటా సన్స్‌ బోర్డు సభ్యుడై ఉండనక్కర్లేదని ఓ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

‘వెర్టికల్‌గా వర్గీకరించడం అనేది సమర్థతలను తీసుకొస్తుంది. ఒకే తరహా వ్యాపారాల మధ్య సహకారం, సమన్వయానికి వీలు కల్పిస్తుంది. దీంతో నిర్వహణ మెరుగవుతుంది. అయితే, ఈ స్థిరీకరణ అనేది విడిగా కంపెనీలకు ఉన్న నిర్వహణ పరమైన స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదు’అని బిర్లా సన్‌లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో ఎ.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. 

టాటాసన్స్ గ్రూప్ సంస్థల పునర్నిర్మాణంపై కసరత్తు జరుగుతున్నట్లు టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ ఒకరు ధ్రువీకరించారు. ఈ అంశాలు వేగంగా పరిష్కారమయ్యేవి కావు. కొన్నింటి పరిష్కారానికి కొన్ని నెలలుగానీ, ఏడాదిగానీ పట్టొచ్చన్నారు.

‘కొన్ని వ్యాపార సులభతరం కోసం దృష్టి పెట్టినవి. మరికొన్ని వాటి పరిధి విస్తరణ కోసం. 2018లో రుణ భారం తగ్గించుకునేందుకు, టాటా కంపెనీల పునర్నిర్మాణానికి, ఒక కంపెనీల్లో మరో కంపెనీకి ఉన్న వాటాల స్థిరీకరణకు, కీలక ఆస్తుల కొనుగోలుకు రూ.70వేల కోట్లు ఖర్చు చేశాం’అని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. నూతన నిర్మాణం కీలక వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సాయపడుతుందన్నారు.

ఐటీ గ్రూపులోకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), స్టీల్స్ సెక్టార్‌లోకి టాటా స్టీల్, ఆటోమేటివ్ విభాగంలోకి.. టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్, టాటా ఆటో కాంప్ సిస్టమ్స్.. ఏరోస్పేస్ క్యాటగిరీలోకి టాటా అడ్వాన్స్‌డ్, కన్జూమర్ అండ్ రిటైల్ రంగంలోకి టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజెస్, వోల్టాస్, టైటాన్, ఇన్ఫినిటీ రిటైల్, ట్రెంట్, క్రోమా సంస్థలను ప్రతిపాదించారు.

ఇక టూరిజం, ట్రావెల్స్ రంగంలోకి ఇండియన్ హోటల్స్, టాటా ఎన్ఐఏ ఎయిర్ లైన్స్ (విస్తారా),  ఏయిరేషియా ఇండియా, టెలికం అండ్ మీడియా విభాగంలోకి టాటా కమ్యూనికేషన్స్, టాటా స్కై, టాటా టెలీ సర్వీసెస్, మౌలిక వసతుల క్యాటగిరీలోకి టాటా పవర్, టాటా ప్రాజెక్ట్స్, టాటా హౌసింగ్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, ఆర్థిక సేవల విభాగంలోకి టాటా క్యాపిటల్, టాటా ఏఐఏ లైఫ్, టాటా అస్సెట్ మేనేజ్మెంట్, టాటా ఏఐజీ, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ రంగంలోకి టాటా ఇంటర్నేషనల్, టాటా ఇండస్ట్రీస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్ప్స్ సంస్థలను చేర్చే యోచనలో టాటా సన్స్ గ్రూపు ఉన్నట్లు సమాచారం. 

click me!