ఐటీలో తిరకాసు: కొత్త పాలసీలో నో చాన్స్ ఫర్ డిడక్షన్.. ఆప్షన్ టాక్స్ పేయర్‌దే

By narsimha lodeFirst Published Feb 2, 2020, 11:07 AM IST
Highlights

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడంతోపాటు ఆదాయం పన్ను చట్టాన్ని సరళీకరించేందుకు కొత్త ఆదాయం పన్ను విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నా. కొన్ని మినహాయింపులు వదులుకొనేవారికి కొత్త విధానంలో ఆదాయం పన్నురేట్లు గణనీయంగా తగ్గుతాయి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించినట్లే కల్పించి తిరకాసు పెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలతోపాటు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు లబ్ధిచేకూరేలా పన్నులను సరళీకరిస్తున్నట్టు సార్వత్రిక బడ్జెట్‌ 2020-21లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి రూ.15 లక్షలలోపు వార్షికాదాయాన్ని కలిగి ఉండి మినహాయింపులను, రాయితీలను వదులుకొనేవారికి కొత్త పన్ను శ్లాబులను ప్రవేశపెట్టారు. 

షరతులతో కొత్త ఐటీ శ్లాబ్‌ల విధానం
ఈ శ్లాబుల ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ నూతన పన్ను విధానాన్ని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. కొత్త శ్లాబ్‌లతో కూడుకున్న విధానాన్ని ఎంచుకొనేవారు కొన్ని రాయితీలను, మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొత్త ఆదాయం పన్ను విధానం ఐచ్ఛికమని ప్రకటించేశారు. 

మినహాయింపులు, రాయితీలపై చెల్లింపుదారులకే ఆప్షన్..బట్
మినహాయింపులు, రాయితీలతో కూడిన పాత ఆదాయం పన్ను విధానంలోనే కొనసాగాలా? లేక కొత్త విధానంలోకి మారాలా? అన్నది పన్నుచెల్లింపుదారుల ఇష్టమే. కానీ ఓసారి కొత్త విధానంలోకి మారితే తర్వాతి సంవత్సరాల్లోనూ అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారు పాత విధానంలోగానీ, కొత్త విధానంలో గానీ ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ఐటీపై నూతన విధానానికి ప్రతిపాదనలు
‘వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడంతోపాటు ఆదాయం పన్ను చట్టాన్ని సరళీకరించేందుకు కొత్త ఆదాయం పన్ను విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నా. కొన్ని మినహాయింపులు వదులుకొనేవారికి కొత్త విధానంలో ఆదాయం పన్నురేట్లు గణనీయంగా తగ్గుతాయి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు ఐదు శాతం టాక్స్ చెల్లించాలి
కొత్త పన్ను ప్రతిపాదన ప్రకారం.. వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు గతంలో మాదిరిగా 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. 

కొత్త ఐటీ శ్లాబ్ ల్లో చెల్లించాల్సిన పన్ను వివరాలిలా
వార్షికాదాయం రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉన్నవారికి పన్నురేటును 10 శాతానికి, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయం గలవారు చెల్లించే పన్నును 15 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలలోపు ఆదాయం గలవారికి పన్నురేటును 20 శాతానికి, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు చెల్లించే పన్నును 25 శాతానికి తగ్గిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఏటా ఖజానాకు రూ.40 వేల కోట్ల ఆదాయం కోత
రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.40 వేలకోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు. ఆదాయం పన్నులో ప్రస్తుతం దాదాపు 100 వరకు రాయితీలు, మినహాయింపులున్నాయని, సరళీకృత కొత్త పన్ను విధానంలో 70 రాయితీలు, మినహాయింపులను తొలిగించామని, మిగిలినవాటిపై తర్వాత పరిశీలిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

రూ.15 లక్షలలోపు ఆదాయం గల వారిపై పన్ను భారం రూ.78 వేల తగ్గుదల
కొత్త విధానంలో పన్నుచెల్లింపుదారులకు గణనీయ లబ్ధి చేకూరుతుందని, ఇది వారు క్లెయిమ్‌చేసే మినహాయింపులు, రాయితీలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఉదాహరణకు రూ.15 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ఓ వ్యక్తి మినహాయింపులు పొందకపోతే పాత విధానంలో రూ.2.73 లక్షల పన్ను చెల్లించాల్సివచ్చేదన్నారు.

ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్లకు ఇలా తిలోదకాలు
కొత్త ఐటీ విధానంలో ఆ వ్యక్తి రూ.1.95 లక్షల పన్ను చెల్లిస్తే సరిపోతుందని, అతనిపై పన్ను భారం రూ.78 వేలు తగ్గుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదాయం పన్ను చట్టం (దీనిలో బీమా ప్రీమియం, భవిష్యనిధి చందా, కొన్ని పెన్షన్‌ ఫండ్లు ఉంటాయి)లోని ఆర్టికల్‌ 80 కింద తొలిగించాలని ప్రతిపాదించిన కొన్ని మినహాయింపుల్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌, ఇంటి అద్దె అలవెన్సు తదితరాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

కొత్త శ్లాబ్ ల్లోకి ఎంటరైతే 80సీ సెక్షన్ రాయితీలకు రాం రాం
ఆదాయం పన్ను చెల్లింపుల కోసం కొత్త శ్లాబులు, రేట్లను ఎంచుకొనేవారు రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ సహా పిల్లల ట్యూషన్‌ ఫీజు, బీమా ప్రీమియం, ప్రావిడెండ్‌ ఫండ్‌, కొన్ని రకాల షేర్లు తదితరాలపై పొందే పలురాయితీలను, మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద పన్ను రాయితీ పొందే హక్కు వీరికి ఉండదు. 

సెక్షన్ 80సీసీసీ మినహాయింపులకూ చరమగీతమేసెక్షన్‌ 80సీసీసీ (కొన్ని రకాల పెన్షన్‌ ఫండ్‌లకు చెల్లించే చందాలు), సెక్షన్‌ 80 డీ (ఆరోగ్య బీమా), 80ఈ (ఉన్నత విద్యకు పొందిన రుణానికి చెల్లించే వడ్డీ), 80ఈఈ (ఇంటికోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ), 80ఈఈబీ (విద్యుత్‌తో నడిచే వాహనం కొనుగోలు), 80జీ (సేవా సంస్థలకు ఇచ్చే విరాళాలు), 80జీజీ (అద్దె చెల్లింపు)పై పన్ను మినహాయింపులతోపాటు ఎల్టీసీ (లీవ్‌ ట్రావె ల్‌ కన్సెషన్‌), మైనర్ల ఆదాయంపై అలవెన్సులు, ఎంపీలు/ఎమ్మెల్యేలకు ఇచ్చే కొన్ని రకాల అలవెన్సులు, ఓచర్ల ద్వారా ఉద్యోగులకు ఉచితంగా అందించే ఆహారం, పానీయాలపై ఇచ్చే పన్ను రాయితీలను వదులుకోవాల్సి ఉంటుంది. 

కొన్ని మినహాయింపులకు అనుమతి ఇలా
విధుల నిర్వహణ కోసం ఉద్యోగులకు ఇచ్చే కన్వేయన్స్‌ అలవెన్సు, ట్రావెల్‌ అలవెన్సు, టూర్‌ అలవెన్సు సహా కొన్నిరకాల భత్యాలపై ఇచ్చే పన్ను మినహాయింపులు కొత్త విధానంలోనూ కొనసాగుతాయి. భవిష్యత్‌లో అన్ని ఐటీపన్ను మినహాయింపులను తొలిగించాలని కేంద్రం భావిస్తున్నదని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టాక ఢిల్లీలో మీడి యాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
 

click me!