మరో 3 లేదా నాలుగేళ్లలో విడిపోనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్..?!

By Sandra Ashok KumarFirst Published Jun 25, 2020, 10:51 AM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో మూడు, నాలుగేళ్లలో విడిపోనున్నదని బెర్న్‌స్టీన్ అధ్యయన నివేదిక అంచనా వేసింది. జియో, రిటైల్ విభాగాల పేరిట వేర్వేరుగా ఐపీవోలకు వెళ్లి పెట్టుబడులను సమీకరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి విభజనకు గురి కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. వచ్చే మూడు, నాలుగేళ్లలో వేర్వేరు సంస్థలుగా జనంలోకి వెళ్లనున్నది.

ఇప్పటికే రుణ రహిత సంస్థగా నిర్దేశించుకున్న గడువుకు మూడు నెలల ముందే మారిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పటి వరకు అన్ని సంస్థలను ఒకే గొడుగు కింద వేర్వేరు విభాగాలుగా నడిపింది. కానీ ఇకముందు అలలా ఉండబోదు. 

అనతి కాలంలోనే సంస్థకు భారీగా పెట్టుబడులు తెచ్చిపెట్టిన టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’, త్వరలో ఈ-కామర్స్ బిజినెస్ రంగంలో కీలకం కానున్న ‘రిలయన్స్ రిటైల్’ వేర్వేరు సంస్థలుగా వినియోగ దారులను అలరించనున్నాయి. ఈ సంగతిని ఓ అధ్యయన సంస్థ బయటపెట్టింది.

త్వరలో రిలయన్స్ జియో, రిటైల్ విభాగాల ఆధ్వర్యంలో పబ్లిక్ ఇష్యూలకు వెళ్లే అంశంపై ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ద్రుష్టి సారించే అవకాశం ఉందని బెర్న్ స్టీన్ అధ్యయన నివేదిక వ్యాఖ్యానించింది. జియో ప్లాట్ ఫామ్స్‌లో 24.7 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్ల పెట్టుబడులను రిలయన్స్ సమీకరించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ లావాదేవీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా రుణ రహిత సంస్థగ మారింది. జియో, రిటైల్ వ్యాపారాల ఐపీవోల ద్వారా వచ్చే మూడు, నాలుగేళ్లలో కంపెనీలో వ్యాపారాల విభజన చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటాదారుల విలువ మరింత పెరుగుతుందని బెర్న్ స్టీన్ అధ్యయన నివేదిక వ్యాఖ్యానించింది. 

also read  బ్యాంక్ కస్టమర్లపై మళ్ళీ చార్జీల మోత..జూలై 1 నుంచి కొత్త రూల్స్..!

15 బిలియన్ డాలర్ల ఆరామ్ కో ఒప్పంద లావాదేవీ, మిగులు నగదు నిల్వలతో వచ్చే కొన్ని ఏళ్లలో ఈక్విటీ-నికర రుణ నిష్పత్తి 2020-21 నాటికంటే పడిపోవచ్చునని బెర్న్ స్టీన్ పేర్కొంది. చమురు-రసాయనా వ్యాపారంలో వాటా విక్రయం కోసం సౌదీ అరేబియా ఆరామ్ కో సంస్థతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

రిలయన్స్ ఈ గణనీయ నిధుల నిల్వలతో ఏం చేస్తున్నదన్నదే ఇప్పుడు ముఖ్యం. ప్రస్తుతానికి తన బ్యాలెన్స్ షీట్ పటిష్ఠం చేసుకోవడానికి ఇతరత్రా రుణ బకాయిలను తగ్గించుకునేందుకు కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నట్లు బెర్న్ స్టీన్ పేర్కొన్నది.

ఇంటర్నెట్, రిటైల్ వ్యాపార విస్తరణలతో విలీనలు, కొనుగోళ్ల ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బెర్న్ స్టీన్ నివేదిక అంచనా వేసింది. ఆరామ్ కో సంస్థ భాగస్వామ్యంతో రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ బిజినెస్‌లోనూ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బెర్న్‌స్టీన్ వ్యాఖ్యానించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ సంస్థ ఎబిటా (వడ్డీ, పన్ను చెల్లింపులు, రుణ సదుపాయానికి ముందు సంస్థ ఆదాయం) రూ.86 వేల కోట్లు ఉంటుందని, ఇది కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు అని బెర్న్ స్టీన్ తెలిపింది. మళ్లీ వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుత ఎబిటాకు రెట్టింపు నమోదవుతుందని తెలుస్తోంది. 

ఇంధన, సంబంధిత వ్యాపార ఆదాయాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ జియో, కొత్త వ్యాపారాల వ్రుద్ధి ఇందుకు దోహద పడుతుందని తెలిపింది. షేర్ లక్ష్యం రూ.1,720 నుంచి రూ.1,870కు పెంచుతున్నామని బెర్న్ స్టీన్ వివరించింది. 
 

click me!