దేశ ఆర్థిక ప్రగతిలో ప్రధాని మోదీ మార్క్ ఇదే, జీడీపీలో ప్రగతి, ముందున్న సవాళ్లు తెలుసుకుందాం...

By Krishna AdithyaFirst Published Sep 15, 2022, 5:43 PM IST
Highlights

భారత ఆర్థిక వ్యవస్థ వడి వడిగా  5 ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అధికారాన్ని చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ 8 ఏళ్ల పాలనలో  డిజిటల్ ఇండియా నినాదం గ్రామీణ స్థాయి వరకూ వెళ్లింది. ప్రధాని మోదీ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎన్నో పెద్ద అడుగులు వేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి చర్యలతో తన మార్క్ చూపించారు.  అయితే కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్లు వచ్చిన నేపథ్యంలో దేశ ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న తన 72వ జన్మదినం జరుపుకోబోతున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గత ఎనిమిదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ లక్ష్యానికి పెద్దపీట వేశారు. అయితే, గత ఎనిమిదేళ్లలో దేశ సాధించిన ఆర్థిక వృద్ధి ప్రపంచ దేశాలను ఆకర్షించింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి, ఆపై ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ, ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించింది. 

ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల స్వయంగా ప్రకటించారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ' మోడీ ప్రసంగంలో 2025 నాటికి భారతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1,000 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఎత్తిచూపుతూ, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద దేశంలో 1500 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధి రేటును ఆశిస్తున్నామని, ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మోదీ తెలపడం, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతోంది. 

అయితే ఇటీవలి కాలంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, భారతదేశంతో సహా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది, దీని కారణంగా శక్తి వంతమైన ఆర్థిక వ్యవస్థగా మారాలనే కలకు ఎదురుదెబ్బ తగిలింది. 

మోదీ హయాంలో GDP వృద్ధి:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) దేశ ఆర్థిక వృద్ధి రేటు, జిడిపి 13.5 శాతంగా ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేశాయి. గత మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఈ వృద్ధి అత్యుత్తమం. ఈ త్రైమాసికాల్లో వృద్ధి 4.1 శాతం నుంచి 8.4 శాతానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మాంద్యం యొక్క సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశం రెండంకెల వృద్ధి నిజంగా అద్భుతమైనదని నిపుణులు భావిస్తున్నారు. ఇది విదేశీ పెట్టుబడిదారులలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. భారతీయ మార్కెట్లలో పెట్టుబడులకు ఇది శుభపరిణామం, అనేక మంది ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లకు ఆకర్షితులవుతారు. 

ఇదిలా ఉంటే గత ఎనిమిది సంవత్సరాలలో భారతదేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి పనితీరు మిశ్రమంగా ఉన్నప్పటికీ, ఊహించిన దానికన్నా మెరుగైన స్థితిలోనే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ 2014 నుండి 2016 వరకు మెరుగైన వృద్ధి సాధించింది. అయితే 2020లో, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. దీని కారణంగా నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత్ వృద్ధిరేటు నెగిటివ్ గా మారింది. అయితే, గత రెండేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ పనితీరు మెరుగ్గా ఉంటుందని IMF, ప్రపంచ బ్యాంకు అంచనా వేశాయి.

 

click me!