Budget 2020: కష్టాలపై ‘దాదా’గిరి...అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

By Sandra Ashok KumarFirst Published Jan 30, 2020, 4:01 PM IST
Highlights

 1982-83లో తయారు చేసిన బడ్జెట్‌ వీటిలో మొదటి కోవకు చెందుతుంది. అప్పట్లో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. వాటిని అధిగమించడానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి చర్యలు చేపట్టారో చూద్దాం..

సాధారణంగా బడ్జెట్‌ను రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రజల అంచనాలకు అనుగుణంగా రూపొందించడం ఒకటికాగా... మరొకటి దేశ ఆర్థిక విధానాల్లో మార్పులకు శ్రీకారం చుడుతూ... వ్యవస్థను పటిష్ఠం చేసేలా తీర్చిదిద్దడం. 1982-83లో తయారు చేసిన బడ్జెట్‌ వీటిలో మొదటి కోవకు చెందుతుంది. అప్పట్లో దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. వాటిని అధిగమించడానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి చర్యలు చేపట్టారో చూద్దాం..
* 1982లో అంతర్జాతీయంగా పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో దిగుమతుల ఖర్చు పెరిగి బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌(బీఓపీ)లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

also read బంగారం రికార్డు ధర...తగ్గిన డిమాండ్

* ఈ భారం బడ్జెట్‌పై పడి ఆర్థిక లోటు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రణబ్‌ ముఖర్జీ అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది బీఓపీ సమస్యను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)తో ఐదు బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకొన్నారు.

* అప్పటి దిగుమతుల్లో పెట్రోల్‌, ఎరువులు, ఉక్కు, వంట నూనె, ఇనుమేతర లోహాలది 60శాతం వాటా. దీంతో దేశీయంగా వీటి ఉత్పత్తిని పెంచి బీఓసీని స్థిరీకరించే దిశగా బడ్జెట్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా ద్రవ్య లోటును తగ్గించి ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడాలన్నదే తన లక్ష్యమని ప్రణబ్‌ ప్రకటించారు. 

* పేద, మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి డబ్బు చేరేలా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రజల పొదుపు, పెట్టుబడి పెరిగి విక్రయాలు పుంజుకునేలా చర్యలు తీసుకున్నారు. అందుకనుగుణంగా ఆదాయపు పన్ను విధానాల్లో మార్పులు చేశారు.

also read Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

* లోహ, కంప్యూటర్‌, కాలిక్యులేటింగ్‌ మెషిన్లు, అకౌంటింగ్‌ మెషిన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్‌ సుంకం పెంచారు. మరోపక్క ఇతర పన్నులు, సుంకాల్ని హేతుబద్ధీకరిస్తూ సరళతరం చేసే ప్రయత్నం చేశారు.

* పేద, అణగారిన వర్గాలే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అందుకనుగుణంగా ఇంధన, వ్యవసాయ, నీటి సరఫరా వంటి వసతులకు కేటాయింపులు పెంచారు.

ఇలా పలు చర్యల ద్వారా బీఓసీ అంతరాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రణబ్‌ ముఖర్జీ సఫలీకృతులయ్యారు. బడ్జెట్‌ను అస్త్రంగా చేసుకొని దవ్యోల్బణ పెరుగుదలను కట్టడి చేసి రాబోయే ఆర్థిక మందగమనానికి కళ్లెం వేయగలిగారు. 

click me!