జెట్ ఎయిర్‌వేస్ టేకాఫ్ అవుతుందా: జూన్ దాటితే దివాళా ప్రక్రియే?

By Siva KodatiFirst Published Apr 8, 2019, 10:39 AM IST
Highlights

బ్యాంకర్ల దరి చేరిన జెట్ ఎయిర్వేస్ కథ సుఖాంతం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాని నిర్వహణకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.1500 కోట్లు విడుదల చేసింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, వీలైనంత త్వరగా ఆ సంస్థ నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి సోమవారం నుంచి బుధవారం వరకు బిడ్లను స్వీకరిస్తారని సమాచారం. 

వాస్తవానికి బిడ్లను ఈనెల 6 - 9 తేదీల్లో ఆహ్వానించాలని తొలుత నిర్ణయించారు. జెట్‌ ఎయిర్వేస్‌ రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా, ఆ కంపెనీ నుంచి తమకు రావాల్సిన రూ.8,000 కోట్ల అప్పులను ఎస్బీఐతోపాటు 26 బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. దీంతో బ్యాంకుల వాటా 51 శాతానికి చేరింది.

జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌, అతడి కుటుంబ సభ్యుల వాటా 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కారానికి ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 180 రోజుల గడువు విధించుకున్నాయి.

రుణ పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) జారీచేసిన గడువు నిర్దేశిత ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసినా, అవే ఆదేశాల ప్రకారం బ్యాంకులు గడువు విధించుకోవడం గమనార్హం. రుణాల ఊబిలో కూరుకున్న సంస్థను గాడిలో పెట్టే వరకు తాము ఎదురుచూడలేమని, బ్యాంకులు ఆర్థిక శాఖకు చెప్పినట్లు అధికార వర్గాల కథనం. 

జూన్‌ 30లోగా వ్యూహాత్మక వాటాదారును తేవడంలో విఫలమైనా, ప్రక్రియ పూర్తి కాకున్నా బ్యాంకులు జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిడ్డింగ్‌ ప్రక్రియకు సరైన స్పందన లభించకపోతే.. బ్యాంకులు వెంటనే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

పాత అప్పుల్ని ఈక్విటీగా మార్చడంతో పాటు, కంపెనీని నడిపించేందుకు రూ.1,500 కోట్లు కొత్త రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అయితే ఎన్ని చేసినా జెట్‌ ఎయిర్వేస్‌ మళ్లీ గాడిన పడుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేశాయి. 

ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న 120 విమానాల్లో కేవలం 20 మాత్రమే తిరుగుతున్నాయి. లీజులు చెల్లించలేక మిగతా విమానాలు ఆయా ఎయిర్‌పోర్టుల్లో హ్యాంగర్లకే పరిమితమయ్యాయి. 

సదరు విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు వాటిని వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ కొత్త విమానాలు సమకూర్చుకోవడం కత్తిమీద సామే.
 
మరోవైపు సిబ్బంది వేతన బకాయిలూ జెట్‌ ఎయిర్వే‌స్‌ను భయ పెడుతున్నాయి. ఈ నెల 15లోగా జనవరి నుంచి మార్చి నెల బకాయిలు చెల్లించకపోతే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని పైలట్లు ఇప్పటికే తేల్చి చెప్పారు. 

ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు అసలు ఏ కంపెనైనా ముందుకు వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతను ఎక్కువ కాలమే మోయాల్సి ఉంటుంది.

click me!