భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు : కానీ ఆ రంగాలలో భలే డిమాండ్..

By Sandra Ashok KumarFirst Published Jun 30, 2020, 1:44 PM IST
Highlights

కరోనా మహమ్మారితో పలు రంగాలు కుదేలయ్యాయి. ఆయా రంగాల ఉద్యోగుల ఉద్వాసనలు దారుణంగా ఉన్నాయి. కానీ ఐటీ, వైద్య రంగ నియామకాలు ప్రోత్సాహకరంగా ఉందని ఇండీడ్ ఇండియా నివేదిక పేర్కొన్నది. 
 

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుండటంతో ప్రతి ఒక్కరిలోనూ తమ ఉద్యోగం ఏమౌతుందోనన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే విభిన్న రంగాల్లో ఉద్యోగుల ఉద్వాసనలు, వేతన కోతలు సర్వసాధారణం అయ్యాయి. పలు సంస్థలు నియామకాలను స్తంభింపచేశాయి.

కోవిడ్‌-19 ప్రభావంతో పలు రంగాల్లో నియామకాలు భారీగా పడిపోయినా ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్‌ రంగాల్లో నియామకాలు ఊపు అందుకున్నాయి. డెలివరీ, ఐటీ మేనేజర్ల నియామకాలు కూడా ప్రోత్సాహకరంగా సాగాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపేస్తున్నా భారత్‌లో హైరింగ్‌ ప్రక్రియ కొన్ని రంగాల్లో పెద్దగా దెబ్బతినలేదని ఇండీడ్ ఇండియా నివేదిక వెల్లడించింది.

మార్చి రెండో వారం వరకూ నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయి. మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్‌, మే వరకూ లాక్‌డౌన్‌ ప్రభావంతో మందగించాయని ఇండీడ్‌ ఇండియా నివేదిక తెలిపింది. జూన్‌లో ఉద్యోగ నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 51 శాతం తగ్గాయి. బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరప్‌ దేశాల్లో 61 శాతం మేర తగ్గాయని పేర్కొంది.

also read 

అమెరికాలో మాత్రం జాబ్‌ పోస్టింగ్స్‌ కేవలం 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ర్టేలియాలో 42 శాతం మేర తగ్గాయని ఇండీడ్ ఇండియా పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇండీడ్‌ వేదికపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. 

కోవిడ్‌-19 ప్రభావంతో అత్యధికంగా చైల్డ్‌కేర్‌, ఆహార తయారీ రంగాల్లో 78 శాతం మేర, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్‌ రంగాల్లో 74 శాతం చొప్పున జాబ్‌ లిస్టింగ్స్‌ తగ్గాయని నివేదిక తెలిపింది. 

కొత్త నియామకాల్లో బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరోపియన్‌ దేశాల్లో 61 శాతం తగ్గుదల ఉందని ఇండీడ్ ఇండియా పేర్కొంది. అమెరికా (29 శాతం), సింగపూర్‌ (32%), ఆస్ట్రేలియా (42%) కన్నా ఉద్యోగావకాశాల క్షీణత విషయంలో భారత్‌లో చాలా ఎక్కువగానే ఉన్నదన్నది. రిమోట్‌ వర్క్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి అవకాశం కల్పిస్తున్న ఉద్యోగాల కోసం అన్వేషణలు ఇటీవల 380% పెరిగినట్టు ఇండీడ్ ఇండియా నివేదిక తెలిపింది. 

యాజమాన్యాలు కూడా ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులతో జతపరిచిన రెజ్యూమ్‌లను సగటున ఆరు సెకన్లు మాత్రమే చూస్తున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఇండీడ్‌ ఇండియా మేనేజర్‌ శశికుమార్‌ తెలిపారు. దీన్ని బట్టి ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు సుదీర్ఘ రెజ్యూమ్‌లు కాకుండా ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా తన ప్రత్యేకతలేమిటో స్పష్టంగా తెలియచేయడమే ప్రధానమని చెప్పారు. 
 

click me!