క్యాష్ క్రంచ్@రూ.70 వేల కోట్లపైనే: ఇదీ ఎన్నికల ఎఫెక్ట్

By rajashekhar garrepallyFirst Published Apr 22, 2019, 3:03 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల పుణ్యమా?!అని బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.70 వేల కోట్ల పై చిలుకు నగదు కొరత నెలకొన్నది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఖర్చు చేయని కేంద్రం.. ఎన్నికల ముంగిట భారీగా నిదులు విడుదల చేస్తుండటంతోపాటు వివిధ సంస్థలు, వ్యక్తులు, పార్టీలు, నేతలు బ్యాంకుల నుంచి భారీగా నగదు విత్ డ్రా చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యవస్థలో నగదు కొరత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ప్రభుత్వ వ్యయంలో స్తబ్దతకు తోడు.. ఎన్నికల వ్యయం పెరిగిపోతుండటంతో వ్యవస్థలో దాదాపు రూ.70 వేల కోట్లకు పైగా నగదు కొరత ఏర్పడింది. పరిస్థితిని ముందే ఊహించిన భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) పలు చర్యలు చేపట్టింది. 

భారీగా బాండ్ల కొనుగోలు జరపడంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త దారిలో డాలర్‌-రూపాయి స్వాప్‌ విధానాన్ని అమలు చేసిన ఆర్బీఐ వ్యవస్థలోకి దాదాపు రూ.35000 కోట్ల మేర సొమ్మును అందుబాటులోకి తెచ్చినా ఎన్నికల వ్యయం దెబ్బకు మళ్లీ వ్యవస్థలో డబ్బుల లోటు అంతకంతకు పెరుగుతోంది.

బ్లూమ్‌బర్గ్‌ ఇండియా బ్యాంకింగ్‌ లిక్విడిటీ గేజ్‌ ప్రకారం ఈ నెల 3వ తేదీన రూ.31,396 కోట్లుగా ఉన్న నగదు కొరత, 16 నాటికి రూ.70,266 కోట్లకు చేరుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది మార్చిలో ఉండే నగదు కొరత కంటే ఈ ఏడాదికి కొరత కొంత ఎక్కువగా నమోదు అవుతోందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త సౌగతా భట్టాచార్య తెలిపారు. 

ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వివిధ పథకాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయక ఆర్బీఐ వద్ద రికార్డు స్థాయిలో నిధులు నిలిచిపోయి ఉన్నాయనీ. ప్రభుత్వ చర్యల వల్ల ఎక్కువ మొత్తంలో నగదు వ్యవస్థలోకి రాలేదని సౌగతా భట్టాచార్య చెప్పారు. దీనికి తోడు బ్యాంకుల నుంచి ఎన్నికల వ్యయం కోసం అధికమొత్తంలో నగదు వితడ్రాలు చేస్తుండడం, విదేశీ మారకపు ద్రవ్యం రాక సన్నగిల్లింది.

గతేడాది ఇదే సమయంలో వ్యవస్థలో దాదాపు రూ.33,400 కోట్ల నుంచి రూ.84,600 కోట్ల మధ్య అధిక నగదు వ్యవస్థలో చెలామణిలో ఉండేదని విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. కాగా వ్యవస్థలో నగదు కొరత వల్ల ద్రవ్య విధానంలో పరవర్తనను సులువుగా అమలు చేయడంలో ఆటంకం ఏర్పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఎన్నికల వేళ వ్యవస్థలో నగదు కొరత ఏర్పడితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ముందుగానే స్కెచ్‌ వేసిన సర్కార్ వ్యూహకర్తలు ఈ దిశగా పావులు కదిపినట్టుగా తెలుస్తోంది 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ దాదాపు రూ.2.98 లక్షల కోట్ల మేర సొమ్మును బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి అందుబాటులోకి తెచ్చింది. 

దీనికి తోడు మార్చి మాసంలో డాలరు-రూపాయి స్వాప్‌ ద్వారా దాదాపు ఐదు బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.34,500 కోట్ల) సొమ్మును వ్యవస్థలోకి తెచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న కొరతను తగ్గించేందుకు గాను మంగళవారం రోజు మరోసారి డాలరు-రూపాయి స్వాప్‌ను నిర్వహించనుంది. దీనికి తోడు త్వరలో టెర్మ్‌రెపో విధానంలో మరింత నగదును వ్యవస్థలోకి జొప్పించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

గత ఏడాది నిల్వలేమీ లేని స్థితితో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఏప్రిల్‌ 16 నాటికి దాదాపు రూ.47,333 కోట్ల మేర అదనపు నిధులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారాంతానికి పెరిగిన జీఎస్టీ పన్ను వసూళ్లతో వ్యవస్థలోని మరింత నగదు ప్రభుత్వం వద్దకు వచ్చి చేరే అవకాశం ఉంది. 

దీంతో నగదు కొరత మరింతగా పెరిగే ప్రమాదం కనిపి స్తోంది. దీంతో ఈ ప్రభావం ప్రజలు చేసే వ్యయంపై ప్రభావం చూపే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి వ్యవస్థలో నగదు కొరత దాదాపు లక్ష కోట్లకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. 

వాస్తవానికి మోడీ సర్కార్‌ బడా కార్పొరేట్లకు 10లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రద్దు చేయటం వల్లనే బ్యాంకుల్లో నగదుకొరతకు కారణమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

అనుకోకుండా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవడమే ప్రస్తుత పరిస్థితికి ఒకానొక ప్రధాన కారణమని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీనియర్‌ ఎకనమిస్ట్‌ ఉపాసన భరద్వాజ్‌ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఖర్చు చేయకపోవటమంటే సంక్షేమం, అభివృద్ధికి కేటాయించిన నిధులను విడుదల చేయకపోవటమేనని స్పష్టం అవుతున్నది.

click me!