మహా ఘట్‌బంధన్ గెలిస్తే ‘రాజన్’ఫైనాన్స్ మినిస్టర్ ?

By ramya NFirst Published Mar 28, 2019, 12:35 PM IST
Highlights


భారతీయుల్లో కాసింత దేశభక్తి ఎక్కువే. 11 ఏళ్ల క్రితం వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి కాయకల్ప చికిత్స చేసేందుకు సూచనలు ఇచ్చిన రఘురామ్ రాజన్ వంటి వారిలో ఒకపాలు ఎక్కువే ఉంటుంది. అందుకే దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మళ్లీ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే ఆయన ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక రంగాన్ని మరోమారు సంస్కరణల బాట పట్టించే అవకాశాలు ఉన్నాయి. అయితే దాని గురించి మాట్లాడటం ఇప్పుడు తొందరపాటవుతుందని రాజన్ పేర్కొనడం గమనార్హం. 

‘దేశానికి నా సేవలు అవసరమైతే తప్పక తిరిగి వస్తా’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి విజయం సాధిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి అవుతారన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ప్రస్తుతం నేను ఉన్న చోట సంతోషంగా ఉన్నాను. అయినా నా సేవలు వినియోగించుకోవాలనుకున్నవారికి నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. 

తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని రాజన్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ తన కొత్త పుస్తకం ది థర్డ్ పిల్లర్ ఆవిష్కరణ సందర్భంగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కేంద్ర ప్రభుత్వంలో క్రీయాశీలక పాత్ర పోషించాలని తనకు ఆసక్తి ఉన్నదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లు ఆర్బీఐ 23వ గవర్నర్‌గా పనిచేసిన రాజన్.. మరో మూడేళ్లు కొనసాగేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా వైదొలిగిన తర్వాత రఘురామ్ రాజన్ తిరిగి తనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకే వెళ్లిపోయిన సంగతీ విదితమే. 

గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రిసెర్చ్ డైరెక్టర్, ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన రాజన్.. ప్రస్తుతం అమెరికాలోని చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అవకాశం కల్సిస్తే దేశానికి సేవలందించేందుకు మళ్లీ వస్తానని, రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయమై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంది’అని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తెచ్చామన్నారు. 

ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలే పుస్తకంలో చేర్చామని అన్నారు. బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తానన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. 
భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు.

ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించాక ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కనీస ఆదాయ భరోసా పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దీన్ని కూడా రఘురామ్ రాజన్ ధ్రువీకరించారు. కనీస ఆదాయ భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సలహాలు, సూచనలు అడిగిన మాట నిజమేనని, అవసరమైన సమాచారం అందజేసి, సూచనలు ఇచ్చానని చెప్పారు. 

‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ హామీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత వీటికి మంగళం పాడిందని, ప్రతి దాంట్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లోనూ జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో వీటికి దూరంగా ఉన్నదని రాజన్ వ్యాఖ్యానించారు. కానీ అన్ని ప్రభుత్వ విభాగాల్లో తమ పెత్తనాన్ని ప్రదర్శించిందని ఆయన దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్ల  పారిపాలన వ్యవస్థ కుంటుపడిందని, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలుగలేదని ఆయన పేర్కొన్నారు. 

‘ప్రస్తుత వృద్ధి గణాంకాలు వేటిని సూచిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు.. భారత వాస్తవ వృద్ధి రేటు తెలుసుకోవడానికి ‘ప్రక్షాళన’ అయితే అవసరం’అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నాకు తెలిసిన మంత్రి ఒకరు ఉన్నారు. ఎటువంటి ఉద్యోగాలూ లేకుండా 7 శాతం వృద్ధిని మనం ఎలా సాధిస్తున్నామనో అర్థం కావడంలేదన్నారు. అంటే మనం 7 శాతం వృద్ధితో ముందుకు వెళ్లడం లేదనేగా’ అని రాజన్‌ అన్నారు. 

నల్లధనాన్ని వెలిక్కి తీయాలనే ఉద్దేశంతో నవంబర్ 8, 2016న నరేంద్ర మోదీ రూ.500, రూ.1,000 పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-కామర్స్ రంగంలో పాలసీలను మార్చివేయడంతో ఈ రంగంలో సేవలు అందిస్తున్న సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై అనిశ్చిత పరిస్థితి నెలకొన్నదని, ముఖ్యంగా ప్లిఫ్‌కార్ట్-వాల్‌మార్ట్ మధ్య కుదిరిన 16 బిలియన్ డాలర్ల ఒప్పందం చివరకు గట్టెక్కిందన్నారు.

click me!