పునర్వ్యవస్థీకరణ దిశగా వోక్స్ వ్యాగన్.. భారత్ ఎండీగా బొపరాయి

By rajesh yFirst Published Nov 21, 2018, 10:36 AM IST
Highlights

జర్మనీ ఆటో మేజర్ వోక్స్ వ్యాగన్ భారతదేశంలో తన సంస్థ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులేస్తున్నది. అందులో భాగంగా స్కోడా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుర్ ప్రతాప్ బొపరాయిని వోక్స్ వ్యాగన్ ఎండీగా నియమించింది. 

న్యూఢిల్లీ: జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ గ్రూప్ సంస్థ భారతదేశంలో యాజమాన్యాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించింది. సుస్థిర ప్రగతి సాధన దిశగా అడుగులేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగా స్కోడా ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గురు ప్రతాప్ బొపరాయిని వోక్స్ వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2019 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది.

సమీప భవిష్యత్‌లో భారతదేశ మార్కెట్లో తమ గ్రూప్ బ్రాండ్ల ఆపరేషన్లు అన్నీ గుర్ ప్రతాప్ బొపరాయి సారథ్యంలోనే సాగుతాయని వోక్స్ వ్యాగన్ పేర్కొంది. భారతదేశంలో వోక్స్ వ్యాగన్ గ్రూప్ సంస్థల పునర్వ్యవస్థీకరణ వచ్చే ఏడాది సాగుతుందన్నది. ఇందుకోసం నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉన్నదని వోక్స్ వ్యాగన్ ఒక ప్రకటనలో వివరించింది. 

ఈ ఏడాది జూలైలో భారతదేశంలో ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు కోసం ఒక బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనున్నట్లు వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. దీనికి స్కోడా సంస్థ కూడా సహకారం అందజేయనున్నది. భారతదేశంలో వోక్స్ వ్యాగన్ గ్రూప్ ‘ఎంక్యూబీ’ వేదిక నుంచి మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నది. ఇక సబ్ కంపాక్ట్ ‘ఎంక్యూబీ ఏఓ’ వేదిక నుంచి స్కోడా తన ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. నూతన ఎస్‌యూవీ బేస్డ్ వోక్స్ వ్యాగన్ ఫ్లెక్సిబుల్ ఎంక్యూబీ వేదిక 2020 ద్వితీయార్థంలో సిద్ధం కానున్నది. 

ప్రభుత్వ బ్యాంకులకు రూ.35 వేల కోట్ల నిధులు తగ్గొచ్చు: క్రిసిల్
మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. 

ఆ నిధులు సమకూర్చే బాధ్యతా కేంద్రానిదేనన్న కృష్ణన్‌ సీతారామన్‌
బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉండటంతో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్‌ బఫర్‌ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. 
నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 30 నాటికి బ్యాంకులు 8.875% క్యాపిటల్‌ అడెక్వసీ రేషియోను పాటించాలి. ఇందులో సీసీబీ వాటా 1.875%. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625% పెంచుకోవాల్సి ఉంది. అయితే, ఈ గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

click me!