సెప్టెంబర్ తర్వాత దేశీయ మార్కెట్లోకి టయోటా బాలెనో

By rajesh yFirst Published Jan 14, 2019, 11:44 AM IST
Highlights


వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశీయ మార్కెట్లోకి జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ తన బాలెనో మోడల్ కారును ఆవిష్కరించనున్నది. ఈ మోడల్ కారు ధరలు రూ.5.42 లక్షల నుంచి రూ.8.53 లక్షల వరకు పలుకుతాయి.

న్యూఢిల్లీ: సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ బాలెనో కారులో కొత్త వెర్షన్‌ను మన దేశంలో విడుదల చేయడానికి జపాన్‌ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ మోడల్‌ విడుదల కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సుజుకీ భారత విభాగం మారుతీ సుజుకీ ప్రస్తుతం విక్రయిస్తున్న బాలెనో మోడల్‌ కారుకు ప్రజాదరణ లభించడంతో, టయోటా కూడా తమ ప్రత్యేక ఫీచర్లను ఈ మోడల్‌లో ప్రవేశపెట్టనున్నది. గతేడాది మార్చిలో.. సుజుకీ, టయోటా సంస్థలు భారత మార్కెట్‌లో హైబ్రీడ్‌, ఇతర కార్లను ఇచ్చి పుచ్చుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

దీని ప్రకారం సుజుకీ బాలెనో, బ్రెజాలను టయోటాకు మారుతి సుజుకి సరఫరా చేస్తుంది. ఇదే సమయంలో టయోటా సెడాన్‌ కరోలాను సుజుకీకి ఇవ్వనున్నది. టయోటా భారత విభాగం టయోటా కిర్లోస్కర్‌ను సంప్రదించగా కారు విడుదల సమయంపై స్పష్టత ఇవ్వలేదు. 

‘టయోటా-సుజుకీ భాగస్వామ్యంలో భాగంలో ఇరు కంపెనీలు సొంత బ్రాండ్లు, మోడళ్ల కింద కార్లను సరఫరా చేసుకోనున్నాయి. ఈ సమయంలో అంతకు మించి ఏమీ చెప్పలేం’ అని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఉపాధ్యక్షుడు అతుషుషి ఓకి పేర్కొన్నారు. 

భారతదేశంలో ధరల సున్నితత్వం గురించి తమకు తెలుసునని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఉపాధ్యక్షుడు అతుషుషి ఓకి చెప్పారు. టయోటా బాలెనో మోడల్ కారు ధర రూ.5.42 లక్షల నుంచి రూ.8.53 లక్షల వరకు పలుకుతుందని చెప్పారు. ఆఫ్రికా తదితర మార్కెట్లలోకి తమ గ్లోబల్ నెట్వర్క్ ద్వారా విస్తరించడమే లక్ష్యంగా టయోటా, మారుతి సుజుకి ముందుకు వెళతాయి. 2020 నాటికి భారతదేశంలోని బ్యాటరీ విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని ఇరు సంస్థలు నిర్ణయానికి వచ్చాయి. 

click me!