ఈ కారెక్కడ ఉన్న నో ప్రాబ్లం.. సీక్రెట్ సెన్సార్ తేల్చేస్తుంది.

By rajesh yFirst Published Aug 21, 2019, 10:54 AM IST
Highlights


మెర్సిడెస్ బెంజ్ కారు తమ కార్లలో సెన్సార్ పేరిట నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసింది. థర్డ్ పార్టీ ద్వారా ప్రత్యేకించి ఫైనాన్స్ ద్వారా విక్రయించే కార్ల బకాయిలను వసూలు చేసుకోవడానికే వీటిని వినియోగిస్తున్నామని నమ్మ బలుకుతోంది మెర్సిడెస్ బెంజ్. 

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ తాము విక్రయించే కార్లలో ఓ రహస్య ఫీచర్‌ అమరుస్తున్నట్లు తొలిసారి బయట పడింది. అదే నిఘా నేత్రం అని దాన్నే ట్రాకింగ్‌ డివైస్‌ అని, లొకేషన్‌ సెన్సర్‌ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్‌ ద్వారా ఆ కారెక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. 

ఈ సంగతి తెలిసిన కస్టమర్లు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. గతేడాది బ్రిటన్‌లో విక్రయించిన 1.70 మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లలో ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. 

తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్‌ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే దీని ఉపయోగాన్ని వాడుకుంటామని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది. థర్ట్‌ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ  ఏర్పాటు చేశామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. 

అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయరాదు. తాము కార్ల విక్రయ సమయంలోనే  వినియోగదారుల నుంచి లొకేషన్‌ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా మెర్సిడెస్ బెంజ్ తెలియజేసింది. 

కార్లను కొనుగోలు సమయంలో, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్ణంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్‌ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్‌ తప్పనిసరైందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్‌ మాజీ రక్షణ మంత్రి డేవిడ్‌ డేవిస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఈ కంపెనీ ఇలా ‘బిగ్‌ బ్రదర్‌’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని లండన్‌ మాజీ రక్షణ మంత్రి డేవిడ్‌ డేవిస్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. 


తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్, వోక్స్‌వాగన్‌ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్‌ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్‌ కంపెనీలకు ఉండాలే గానీ మెర్సిడెస్‌ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్‌ కారులు చోరీకి గురయ్యాయి. 

click me!