హెచ్పీసీఎల్ స్టేషన్లు.. విద్యుత్ వాహనాలకు టాటా ‘పవర్’!!

By sivanagaprasad kodatiFirst Published Sep 30, 2018, 11:24 AM IST
Highlights

యావత్ ప్రపంచం అంతా విద్యుత్ వాహనాల వెంట పరుగులు తీస్తోంది. అందులో భారతదేశం కూడా ఒక భాగస్వామి. అయితే మనదేశంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ వసతులు పెద్ద లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో టాటా పవర్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు ఉమ్మడిగా ఎంఓయూ చేసుకున్నాయి.

క్రమంగా దేశీయంగా, అంతర్జాతీయంగా విద్యుత్ వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతున్న వేళ పెట్రోల్ / డీజిల్ / సీఎన్జీ గ్యాస్ స్టేషన్ల స్థానే విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల కొరత ప్రధాన అవరోధం కానున్నది.

ఈ క్రమంలో టాటాసన్స్ అనుబంధ సంస్థ టాటా పవర్.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) జత కట్టాయి. వాణిజ్యస్థాయిలో విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పంపుల వద్ద రిటైల్ ఔట్ లెట్లు, ఇతర కేంద్రాల్లో ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సహకార ఒప్పందం అమలుకు ప్రణాళిక రూపొందించడంతోపాటు విద్యుత్ వాహనాలకు మౌలిక వసతులను అభివ్రుద్ధి చేసేందుకు రెండు సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా సంప్రదాయేతర ఇంధన వనరుల అభివ్రుద్ధికి చర్యలు చేపట్టనున్నాయి. 

టాటా మోటార్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ హెచ్ పీసీఎల్ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నదని తాము ఆనందిస్తున్నామని చెప్పారు. సంప్రదాయ సరిహద్దులు దాటి తమ సర్వీసుల విస్తరణ దిశగా ముఖ్యమైన అడుగు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వాహనాలకు సేవలందించడం కోసం దేశవ్యాప్తంగా ప్రతిపాదిత చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రవీర్ సిన్హా తెలిపారు. 

దేశంలోని విద్యుత్ వాహనాలకు అవసరమైన సవేలందించేందుకు తాము కీలక పాత్ర పోషించబోతున్నామని టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హా చెప్పారు. భవిష్యత్‌లో సుస్థిరంగా భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ దిశగా కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా సుస్థిర విద్యుత్ సరఫరా దిశగా టాటా పవర్ ఫ్రంట్‌రన్నర్‌గా ముందుకు వెళుతోంది. వ్యూహాత్మక కేంద్రాల్లో చార్జింగ్ స్టేషన్ల మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోంది టాటా పవర్. జాతీయ స్థాయిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో విద్యుత్ వాహనాల మౌలిక వసతులను కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టాటా పవర్ బిజినెస్ సర్వీసెస్, బిజినెస్ ఎక్స్‌లెన్స్ చీఫ్ స్ట్రాటర్జీ రాహుల్ షా తెలిపారు. 

హెచ్‌పీసీఎల్ కార్పొరేట్ స్ట్రాటర్జీ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజనీష్ మెహతా మాట్లాడుతూ దేశ ప్రజలంతా విద్యుత్ వాహనాల వైపు మళ్లాలంటే ప్రధాన అవరోధం జాతీయ స్థాయిలో చార్జింగ్ మౌలిక వసతులు లేకపోవడమేనని తెలిపారు.

చార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్  ఏర్పాటు చేయగలిగినప్పుడు జాతీయ స్థాయిలో విద్యుత్ వాహనాలను అంగీకరించేందుకు వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. చివరి దశ వరకు విద్యుత్ చార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగలిగినప్పుడే ప్రజలంతా విద్యుత్ వాహనాల దత్తత దిశగా అడుగులు వేస్తారని రజనీష్ మెహతా తెలిపారు. 

click me!