టాటా నెక్సాస్.. ఆపై మహీంద్రా మరాజో సేఫ్

By rajesh yFirst Published Dec 8, 2018, 10:21 AM IST
Highlights

వినియోగదారుల ప్రత్యేకించి ప్రయాణికుల భద్రత విషయంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆచితూచి అడుగేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణానికి ముప్పు లేకుంటా టాటా మోటార్స్ ఆధ్వర్యంలోని టాటా నెక్సాన్ ఐదు స్టార్లతో మొదటి స్థానాన్ని, మహీంద్రా మరాజో నాలుగు స్టార్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి.

ముంబై: వాహనం దేన్నైనా ఢీకొని ప్రమాదానికి లోనైనపుడు, అందులో ప్రయాణిస్తున్న వారు ఎంతవరకు సురక్షితంగా ఉంటారనే విషయాన్ని నిర్థారించే ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో టాటా మోటార్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. అంతర్జాతీయ  ప్రమాణాలతో నిర్వహించే ఈ పరీక్షలో భారతీయ కారు, పూర్తిస్థాయి రేటింగ్‌ సాధించడం ఇదే తొలిసారి. 

పెద్దలు ప్రయాణిస్తున్నపుడు రక్షణకు 5వ స్టార్‌ రేటింగ్‌, పిల్లలు ప్రయాణిస్తున్న సమయంలో భద్రతకు 3 స్టార్‌ రేటింగ్‌ లభించింది. ఈ ఏడాది ఆరంభంలో టాటా నెక్సాన్‌కు కూడా 4 స్టార్‌ రేటింగ్‌ లభించడం గమనార్హం. డ్రైవర్‌, ప్రయాణికులు సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోతే హెచ్చరించే వ్యవస్థతో పాటు, ప్రయాణికుల భద్రతకు మరిన్ని వసతులు కల్పించడం వల్లే నెక్సాన్‌కు 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది. 

ఈ నెల ఏడో తేదీ నుంచి తయారయ్యే వాహనాలకు ఈ రేటింగ్‌ వర్తిస్తుంది. ఈ వాహన పరీక్షలో పెద్దల తల మెడకు మంచి భద్రత, డ్రైవర్‌ ఛాతీకి కొంతవరకు రక్షణ, ప్రయాణికుల ఛాతీకి కూడా సరిపడా రక్షణ లభిస్తుంది. 18 నెలల పిల్లలకు పూర్తి రక్షణ లభిస్తే, మూడేళ్ల పిల్లల ఛాతీ, తలకు కొంతవరకు లభించింది.

టాటా నెక్సాస్ తర్వాత మహీంద్రా మరాజోకు చోటు

బహుళ వినియోగ వాహనం మరాజోకు ఎన్‌సీఏపీ పరీక్షలో 4 స్టార్‌ రేటింగ్‌ లభించిందని మహీంద్రా తెలిపింది. పెద్దవారు ప్రయాణిస్తున్నపుడు, ప్రమాదానికి గురైతే ఎంతవరకు రక్షణ లభిస్తుందనే దానికి ఈ రేటింగ్‌ నిదర్శనం. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్‌ హెచ్చరిక వంటి వ్యవస్థలు ఈ వాహనంలో ఉన్నాయి. ప్రయాణికుల తల, మెడకు మంచి రక్షణ, డ్రైవర్‌ ఛాతీకి కొంతవరకు, ప్రయాణికుల ఛాతీకి తగినంత రక్షణ కల్పిస్తుంది. మోకాళ్లు కూడా సురక్షితంగా ఉంటాయి. అన్ని వాహనాల్లో అధిక భద్రతా సదుపాయాలు కల్పిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

click me!