చైనా సుంకాలు+తగ్గిన జాగ్వార్ రెవెన్యూ=టాటా మోటార్స్‌కు నష్టం

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 8:13 AM IST
Highlights

ప్రణాళికా బద్ధంగా దూసుకెళ్లే టాటా సన్స్ గ్రూప్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి రూ.1009 కోట్ల నష్టం వాటిల్లింది. చైనా సుంకాలతోపాటు జాగ్వార్ లాండ్ రోవర్ ఆదాయం తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది.
 

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్‌కు గత త్రైమాసికంలో రూ.1009 కోట్ల నష్టం వాటిల్లింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,483కోట్ల లాభం రాగా, ఈ ఏడాది రూ.1009కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.

చైనాలో సుంకాలు పెరడంతో జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు తగ్గడం, థాయిలాండ్‌లో సబ్సిడీ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ నష్టం వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా మోటార్స్‌ రూ.2,501.67కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిందని కంపెనీ తెలిపింది.

అయితే సంస్థ మొత్తం ఆదాయం 3.3% పెరుగుదలతో రూ.72,112.08 కోట్లుగా నమోదైందని తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థకు రూ.69,838.68కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. కంపెనీ స్టాండలోన్‌ ప్రాతిపదికన.. రూ.109.14కోట్ల లాభం వచ్చిందని, రూ.283.37కోట్ల నికర నష్టం వచ్చిందని తెలిపింది.

మొత్తం ఆదాయం గత ఏడాది ఈ త్రైమాసికంలో రూ.13,310.37కోట్లు కాగా, ఈ త్రైమాసికంలో రూ.17,758.69కోట్లుగా నమోదైందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ ఆదాయం 11శాతం తగ్గినట్లు తెలిపింది. అయితే పోటీ మార్కెట్లో తాము సమర్థవంతంగానే వ్యవహరిస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది.

దేశీయంగా టాటా మోటార్స్ నిర్వహణ, ఆర్థికపరంగా పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తున్నదని టాటా సన్స్ గ్రూప్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బ్రిటిష్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు బలహీనంగా ఉండటం నష్టాలు నమోదు చేయడానికి కారణమని తెలిపింది.

జాగ్వార్ లాండ్ రోవర్ ఆదాయం 11 శాతం తగ్గుముఖం పట్టి 5.6 బిలియన్ల పౌండ్లకు చేరుకున్నది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిస్థితి మెరుగుదలకు సమగ్ర ప్రణాళికను రూపొందించామని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. జాగ్వార్ లాండ్ రోవర్ లీడర్ షిప్ టీం ప్రణాళిక ప్రకారం లక్ష్య సాధనకు ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. 

click me!