త్వరలో విపణిలోకి మహీంద్రా గ్యాసోలిన్‌ వెహికల్: పవన్‌ గోయెంకా

By rajesh yFirst Published Jun 4, 2019, 11:44 AM IST
Highlights


దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా బీఎస్-6 ప్రమాణాలతో కొన్ని నెలల్లో గ్యాసోలిన్ వాహనాన్ని విపణిలోకి విడుదల చేయనున్నది. ఇందుకోసం రూ.1000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా తెలిపారు.

ముంబై: మోటార్‌ వాహనాల నుంచి వెలువడే కాలుష్యం నియంత్రణ కోసం భారత ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. వీటికి అనుగుణంగా తమ వాహనాల ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ‘బీఎస్‌–6‌’ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తాజా నిబంధనలకు తగిన వాహనాలను ఈ ఏడాది నుంచే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరికల్లా నాటికి బీఎస్‌–6 గ్యాసోలిన్‌ వాహనాన్ని సిద్ధం చేస్తున్నాం అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా తెలిపారు. 

నూతన నిబంధనలకు తగిన విధంగా ఇంధనం ఉండాలనే ఆంక్షలు లేనందున తొలుత దీనిని విడుదలచేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. డీజిల్‌ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్‌–6 ఇంధనం అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నందున ఈ వాహన విడుదల ఆలస్యం కానుంది. 

నూతన నిబంధనలకు సరిపడే విధంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాం అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. ఈ నిబంధనల అమలుకు సంబంధించి ఎటువంటి టెక్నికల్‌ సమస్యలను ఎదుర్కొలేదు. ముందస్తు ప్రణాళికతో నూతన తరం వాహనాలను అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధం చేశామని అన్నారు.

‘బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా డీజిల్‌ వాహనాలను అందుబాటులోకి వచ్చే వరకు వాటిని తీసుకురాం. డిసెంబరు లేదా జనవరిలో ఇది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా చెప్పారు. 

బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయడానికి మహీంద్రా రూ.1,000 కోట్లు ఖర్చు చేసింది. కాగా వచ్చే రెండు మూడు నెలల్లో ఆటోమొబైల్‌ వ్యాపార పరిమాణాన్ని.. సప్లయర్లు, ప్లాంట్లు పెంచడం, తగ్గించడం చాలా సవాలుతో కూడుకున్న వ్యవహారమని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా అన్నారు. 

గత మూడున్నరేళ్లలో ఆటో రంగానికి సంబంధించి దేశంలోని ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌, సోర్సింగ్‌ సంస్థలకు అనేక సవాళ్లు ఎదురైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. బీఎస్‌-6 వాహనాల కోసం మూడున్నరేళ్ల కాలంలో దాదాపు 700 మంది పని చేశారన్నారు. 

తాము సిద్ధంగా ఉన్నామని, 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి బీఎస్‌ 6 వాహనాలను మార్కెట్లోకి తీసుకువెళ్లడానికి ఎలాంటి టెక్నికల్‌ రిస్క్‌లు లేవని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. బీఎస్‌ 6 అనే సవాలు కూడా ఒక అవకాశంగా మారిందని, దీని ద్వారా మంచి ఉత్పత్తులను కస్టమర్లకు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

click me!