సేఫ్టీ నార్మ్స్ ఫస్ట్: జూలై నుంచి మహీంద్రా కార్లపై రూ.36 వేల వరకు ధర పెంపు

By rajesh yFirst Published Jun 20, 2019, 12:19 PM IST
Highlights

కార్లలో సేఫ్టీ ఫీచర్లు చేరుస్తుండటంతో పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు ఆటోమొబైల్ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో హోండా కార్లు తొలుత ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించగా, తాజాగా మహీంద్రా అదే దారిలో పయనిస్తున్నట్లు తెలిపింది. 

ముంబై: దేశంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ  మహీంద్రా అండ్‌ మహీంద్రా తన మోడళ్లపై ధరలు పెంచినట్లు బుధవారం ప్రకటించింది. సంస్థ ఉత్పత్తి చేసిన వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.36 వేల వరకు మహీంద్రా ధరను పెంచేసింది. 

పెంచిన ధరలు ఈ ఏడాది జులై‌ 1 పెంచిన కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మార్పులు (ఏఐఎస్ 145 సేఫ్టీ నార్మ్స్‌) చేస్తున్న నేపథ్యంలో ఇతర మోడళ్లపై ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఎఐఎస్‌ 145 సేఫ్టీ నార్మ్స్‌లో భాగంగా అన్ని ప్యాసింజర్‌ వాహనాల్లో డ్రైవర్‌ ఎయిర్‌బ్యాగ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, ఓవర్‌ స్పీడ్‌ అలర్ట్‌ లాంటి భద్రతపరమైన మార్పులు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో మహీంద్ర అండ్‌ మహీంద్రా ఎస్‌యూవీ శ్రేణి వాహనాలైన మహీంద్ర స్కార్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీపై గణనీయంగా పెంచగా.. ఎక్స్‌యూవీ500, మరాజో మోడళ్లపై స్పల్పంగా ధరలు పెంచినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 

‘ప్రయాణికుల భద్రతకు సంస్థ మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. భద్రతా పరమైన ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా సంస్థ వాటిని స్వాగతిస్తుంది. ఇలాంటి నూతన నిబంధనలు అమలు చేసే సమయంలో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఇది సహజం’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం అధ్యక్షుడు రాజన్‌ వధేరా పేర్కొన్నారు.

భారత విపణిలోకి మరో స్పోర్ట్స్‌ బైక్‌ ‘ఆర్సీ 125’
యూరప్‌కు చెందిన ప్రముఖ మోటార్‌ సైకిళ్ల‌ తయారీ సంస్థ కేటీఎం భారత మార్కెట్లోకి సరికొత్త ఆర్‌సీ 125 ఏబీఎస్‌ మోడల్‌ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.47 లక్షలుగా ఉంది.  దేశవ్యాప్తంగా గల 470 కేటీఎం షోరూంలలో ఈ బైక్ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఈ నెలాఖరు నుంచి ఆర్సీ 125 వాహనాలు అందుబాటులోకి వస్తాయని కేటీఎం అనుబంధ సంస్థ బజాజ్‌ ఆటో ప్రకటించింది.

‘స్పోర్ట్స్‌ ప్రపంచంలో కేటీఎం మోటార్ సైకిల్స్‌ సరికొత్త ఒరవడిని సృష్టిస్తాయి. స్పోర్ట్స్‌ బైక్స్‌పై ఆసక్తి, అభిరుచి ఉన్నవారికి ఈ మోడల్‌ సరికొత్త అనుభూతిని అందిస్తుంది’అని బజాజ్‌ ఆటో ప్రోబైకింగ్ విభాగం ఉపాధ్యక్షుడు సుమీత్‌ నారంగ్‌ పేర్కొన్నారు.

కేటీఎం స్టీల్‌ ట్రెల్లీస్‌ ఫ్రేమ్‌, అప్‌సైడ్‌ డౌన్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్, త్రిపుల్‌ క్లాంప్‌ హ్యండ్లర్‌, ట్విన్‌ ప్రొజెక్టర్‌ హడ్‌లైట్స్‌ ఈ మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ ప్రకటించింది. ఈ మోడల్‌ మోటార్ సైకిల్‌ 124.7 అడ్వాన్స్‌డ్‌ డీఓహెచ్‌సీ ఇంజిన్‌, 14.5 పీఎస్‌ శక్తి, 12 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

click me!