సేఫ్ క్యాబిన్లతో విపణిలోకి మహీంద్రా ‘ఫ్యూరియో’ ట్రక్‌

By sivanagaprasad kodatiFirst Published Jan 30, 2019, 8:58 AM IST
Highlights

ప్రముఖ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా వాణిజ్య విభాగంలో సరికొత్త రేంజ్ ట్రక్ ‘ఫ్యూరియో’ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.17.45 లక్షలుగా నిర్ణయించారు. 

మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ ఫ్యూరియో రేంజీ సరికొత్త మధ్య శ్రేణి వాణిజ్య వాహనం ‘ప్యూరియో’ ట్రక్కును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిని గత ఏడాది మహీంద్రా ఆవిష్కరించింది.  దీనిలో 12టన్నుల రేంజి వాహనం ధర రూ.17.45లక్షలు, 14టన్నుల రేంజ్ వాహనం ధర రూ.18.10లక్షలుగా నిర్ణయించారు.

మహీంద్రా ఇటాలియన్‌ డిజైన్‌ హౌస్‌ పినిన్ఫరియాలో రూపుదిద్దుకున్న ఈ డిజైన్  కోసం మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2014 నుంచి ఈ ప్రాజెక్టులో 500 మంది ఇంజినీర్లు, 180 సప్లయర్లు భాగస్వాములయ్యారు.

ఫ్యూరియో రేంజి ట్రక్కులను చకన్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ విభాగంలో ఐషర్‌, టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.ఈ సరికొత్త ట్రక్కులో సురక్షితమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లు ఉన్నాయి.

దీనిలో సరికొత్త ఎండీఐ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 2400 ఆర్‌పీఎం వద్ద 500 ఎన్‌ఎం టార్క్‌, 138 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో ఫ్యూయల్‌ స్మార్ట్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా లోడ్‌ను బట్టి డ్రైవ్‌ మోడ్‌ను ఎంచుకొనే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఐసీవీ పరిశ్రమ ఏటా 17 శాతం పురోగతి నమోదు చేస్తున్నదన్నారు. ఏడాదికి 1.10 లక్షల యూనిట్ల ఉత్పత్తికి చేరుకోవడంతో ఐసీవీ పరిశ్రమ పరిణతి స్థాయికి చేరుకుంటున్నదన్నారు.

వినియోగదారుల్లో విశ్వాసం కోసం తమ కంపెనీ పూర్తి నిబద్దతతో పని చేస్తుందని పవన్ గోయెంకా పేర్కొన్నారు. ఐదేళ్లు గానీ ఐదు లక్షల కిలోమీటర్ల వరకు మెయింటెనెన్స్ గ్యారంటీ ఇవ్వగలమని తెలిపారు. 

click me!