ఈవీ విడిభాగాలపై సుంకాలు తగ్గించండి.. పరిశ్రమలశాఖ అప్పీల్

By rajesh yFirst Published Dec 22, 2018, 10:42 AM IST
Highlights

విద్యుత్ వినియోగ వాహనాల విడి భాగాలపై సుంకాలు తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖను భారీ పరిశ్రమలశాఖ కోరింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారీ పరిశ్రమలశాఖ మంత్రి అనంత గీతె తెలిపారు. విద్యుత్ వాహనాల్లో అవసరమైన లిథీయం బ్యాటరీల తయారీకి భెల్ చర్యలు చేపట్టిందన్నారు.

న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగ వాహనాల్లో ఉపయోగించే విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారంనాడిక్కడ నాసిక్‌కు చెందిన స్టార్టప్‌ నిబే మోటార్స్‌ రూపొందించిన ఈ-రిక్షా, ఈ-స్కూటర్‌ విడుదల చేసిన సందర్భంగా అనంత గీతే మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని చూస్తున్నట్లు చెప్పారు.
 
దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అవసరమైన మద్దతును అందించనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి అనంత గీతే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కీలకంగా ఉన్న బ్యాటరీ, కంట్రోలర్‌, చార్జర్‌, కన్వర్టర్‌, ఎనర్జీ మానిటర్‌, ఎలక్ట్రిక్‌ కంప్రెసర్‌లపై కస్టమ్స్‌ సుంకాలను విధించటం లేదు. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే మెటల్స్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై మాత్రం 28 శాతం బేసిక్‌ కస్టమ్‌ సుంకాలను విధిస్తున్నారు.
 
యూఎస్‌ కంపెనీతో భెల్‌ చర్చలు
వచ్చే ఏడాదిలోగా దేశంలో లిథియం ఇయాన్‌ బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ సన్నాహాలు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. ఇందుకోసం అమెరికా సంస్థతో భెల్‌ చర్చలు సాగిస్తోందని చెప్పారు. ప్రస్తుతం లిథియం అయాన్‌ బ్యాటరీలను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నామని, వచ్చే ఏడాదిలోపు వీటిని భారత్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు గీతే తెలిపారు.
 

click me!