ఫోర్డ్‌ పొదుపు చర్యలు: 12 వేల మంది కొలువులు గోవిందా

By rajesh yFirst Published Jun 28, 2019, 10:48 AM IST
Highlights

అమెరికా ఆటో మేజర్ ‘ఫోర్ట్’ పునర్వ్యవస్థీకరణ పేరిట యూరప్ దేశాల్లోని యూనిట్లలో 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ఫ్రాంక్‌ఫర్ట్‌: అమెరికా ఆటో దిగ్గజం ‘ఫోర్డ్’ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా ఐరోపాలో మొత్తం 12,000 ఉద్యోగాల కోత విధించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే జర్మనీలో ప్రకటించిన 5,400 ఉద్యోగాలు, వేల్స్‌లో 1700 ఉద్యోగాల కోత ఈ ప్రణాళికలోనే ఉన్నట్లు ఫోర్ట్ తెలిపింది. ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో కంపెనీ బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, స్లొవేకియాల్లో ఆరు ప్లాంట్‌లను విక్రయించనున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలను ప్రకటించింది.

స్వచ్ఛంద విరమణ కార్యక్రమంలో భాగంగానే ఉద్యోగాల కోత ఉంటుందని ఫోర్డ్‌ వెల్లడించింది. ఐరోపాలో ఫోర్డ్‌కు 24 ఫ్యాక్టరీలు, దాదాపు 51,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వేల్స్‌లో 1, రష్యాలో 3, స్లొవేకియా, ఫ్రాన్స్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున ఫ్యాక్టరీలను మూసివేయనుంది. 

ఒక్క రోజులో 1000 హ్యుండాయ్ వెన్యూ కార్ల సేల్స్ 
తమ సంస్థ సరికొత్త మోడల్‌ ‘హ్యుండాయ్‌ వెన్యూ’ ఒక్క రోజులోనే 1000 కార్లు అమ్ముడై రికార్డు సృష్టించిందని హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయ విభాగాధిపతి వికాస్‌ జైన్‌ ఇక్కడ తెలిపారు. ఈ కారు విపణిలోకి వచ్చి నెల పూర్తయిన నేపథ్యంలో తొలి మాసికోత్సవాలు నిర్వహించారు. నెలరోజుల వ్యవధిలో 33 వేల కార్ల బుకింగ్‌ జరిగిందని జైన్‌ తెలిపారు.

సుమారు 2 లక్షల మంది ‘వెన్యూ’పై ఆసక్తి చూపారని ఆయన వివరించారు. వినియోగదారుల సంతృప్తిని ఇనుమడింప చేస్తున్న హ్యుండాయ్‌ వెన్యూ, దేశీయ విపణిలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని వికాస్‌ జైన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని జైన్‌ తెలిపారు.

click me!