విపణిలోకి బీఎండబ్ల్యూ సూపర్ బైక్ `ఎస్ 1000 ఆర్ఆర్`: కేంద్రం అనుమతిస్తే ఎలక్ట్రిక్ బైక్ కూడా

By rajesh yFirst Published Jun 28, 2019, 11:37 AM IST
Highlights


జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లోకి తాజాగా ‘ఎస్1000 ఆర్ఆర్’ సూపర్ బైక్ ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అనుమతించి రాయితీలు కల్పిస్తే విద్యుత్ వాహనాలను తీసుకొస్తామని తెలిపింది.

న్యూఢిల్లీ: జర్మనీ ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన సరికొత్త ‘ఎస్ 1000 ఆర్ఆర్ సూపర్ బైక్`ను భారత విపణిలోకి గురువారం విడుదల చేసింది. దీని ధరను రూ.18.50లక్షలుగా నిర్ణయించింది. గతేడాది మిలాన్‌లో జరిగిన ఈఐసీఎంఏ మోటార్ సైకిల్ షోలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. తాజాగా దీన్ని భారత్ విపణిలోకి తీసుకొచ్చారు.

 

బీఎండబ్ల్యూ నుంచి ఈ మోడల్లో వస్తున్న మూడోతరం బైక్ ఇది. 2009లో తొలి మోడల్ బైక్ తీసుకొచ్చారు. గత బైక్‌తో పోలిస్తే ఇంజిన్లోనూ, హెడ్ల్యాంప్లోనూ పలు మార్పులు చేర్పులు చేశారు. పాత బైక్‌తో పోలిస్తే ఇది 11 కేజీలు తక్కువ బరువు (197కేజీలు) ఉంటుంది.

 

ఈ సూపర్ బైక్ ధర రూ.8.50 లక్షల నుంచి రూ.22.95 లక్షల మధ్య బీఎండబ్ల్యూ నిర్ణయించింది. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ మోటోరాడ్ హెడ్ ద్మిత్రిస్ రాప్టిస్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రీమియం బైకులకు ఆదరణ పెరుగుతున్నదన్నారు. ఈ ఏడాది చివరికల్లా భారతదేశంలో బీఎండబ్ల్యూ విక్రయాలు మూడోస్థానానికి చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. 

 

బీఎండబ్ల్యూ బైక్ విక్రయాల్లో గతేడాది ఆసియా-పసిఫిక్, చైనా, రష్యా, ఆఫ్రికా తర్వాత ఐదో స్థానంలో నిలిచింది. విక్రయాల పరంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉన్నదని బీఎండబ్ల్యూ మోటోరాడ్ హెడ్ ద్మిత్రిస్ రాప్టిస్ అన్నారు. 


2017లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ..గతేడాది 2,187 యూనిట్లను విక్రయించింది. పాతదాంతో పోలిస్తే ఈ నూతన మోడల్ తక్కువ బరువు కలిగి ఉన్నదని, అలాగే అత్యంత వేగం, సులువుగా కంట్రోల్ చేయడానికి వీలుగా పలు మార్పులు చేసినట్లు బీఎండబ్ల్యూ మోటోరాడ్ హెడ్ ద్మిత్రిస్ రాప్టిస్ చెప్పారు. 


ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు, రాయితీలు ఇస్తేనే భారత్లో ఎలక్ట్రిక్ బైకులను ప్రవేశపెడుతామని బీఎండబ్ల్యూ మోటోరాడ్ హెడ్ ద్మిత్రిస్ రాప్టిస్  స్పష్టంచేశారు. 998 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ అత్యధికంగా 204 బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. 113 ఎన్ఎం టార్చ్ కలిగి ఉంటుంది. 

 

ఇందులో మొత్తం 6 గేర్లు ఉంటాయి. రోడ్, రెయిన్, డైనమిక్ అండ్ రేస్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. వీటితో పాటు అదనంగా మూడు ‘ప్రో’ మోడ్లను కంపెనీ అందిస్తోంది.

 

లాంచ్ కంట్రోల్, వేగాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే పిట్లేన్ స్పీడ్ లిమిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6.5 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న డుకాటీ పనిగలే వీ4, కవాసాకీ జడ్ఎక్స్-10ఆర్ఆర్, సుజుకీ జీఎస్ఎక్స్-ఆర్1000 వంటి సూపర్ బైక్లకు ఇది పోటీగా నిలవనుంది.

click me!