వ్యక్తిగత చార్జింగ్ స్టేషన్లతోపాటు ఈవీ ఇన్‌ఫ్రా పై త్వరలో పాలసీ

By sivanagaprasad kodatiFirst Published Nov 12, 2018, 8:55 AM IST
Highlights

దేశీయంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు కేంద్రం చకచకా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు త్వరలో విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తెలిపారు. 

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంపుదలతోపాటు మౌలిక వసతుల కల్పనకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనున్నది. ఈ పాలసీలో వాణిజ్య అవసరాల నిమిత్తం వ్యక్తిగతంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తామని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు.

ఈవీ చార్జింగ్ పాలసీపై సూచనలు చేయాలని ఇతర మంత్రిత్వ శాఖలను, విభాగాలను కోరినట్లు మంత్రి ఆర్ కే సింగ్ చెప్పారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు ఉచితంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు ఇంటర్నేషనల్ సింపోసియ్ టూ ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసర్చ్ ఇన్ ఎనర్జీ ఎఫిసెన్సీ(ఇన్‌స్పైర్) కార్యక్రమంలో మంత్రి ఆర్ కే సింగ్ చెప్పారు.

వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న చార్జింగ్ స్టేషన్లను కమర్షియల్ పరంగా వినియోగించుకోవచ్చునని, ఇందుకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని మంత్రి స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌తో నడిచే వాహనాలకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా లైసెన్సు అవసరమే లేదని మంత్రి ఆర్ కే సింగ్ స్పష్టం చేశారు. 

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల కల్పనతోనే దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగనున్నది. ప్రస్తుతం వెలువడుతున్న కర్బన ఉద్గారాలను మూడో వంతు తగ్గించడానికి 2005 నాటి కమిట్‌మెంట్‌కు అనుగుణంగా లక్ష్య సాధనకు 2030 నాటికి గణనీయ స్థాయిలో భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగ సామర్థ్యం పెంపొందించాల్సి ఉన్నది. 

దీనికి తోడు పవన, సౌర విద్యుత్ రంగాల్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక పాంట్ల విస్తరణ కోసం వేలం వేయనున్నట్లు కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తెలిపారు. ఒక్కో యూనిట్ విద్యుత్‌పై టారిఫ్ సీలింగ్ రూ.2.70లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 26న వేలం నిర్వహించాల్సి ఉన్నది. కానీ దాన్ని ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు.  

10 జిగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు విషయమై బిడ్ల దాఖలు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్ కే సింగ్ తెలిపారు. ఆ మరుసటి రోజునే టెక్నికల్, కమర్షియల్ బిడ్లు తెరుస్తారు. ఇక మూడు జిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి బిడ్ల దాఖలు గడువును పలు దఫాలు పొడిగించామని, దీని గడువు సోమవారంతో ముగిసిందని తెలిపారు.

కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ప్రభుత్వానికి చాలా ముఖ్యం. 2022 నాటికి 60 గిగా వాట్ల పవన విద్యుత్, 100 గిగా వాట్ల సౌర విద్యుత్ తోపాటు 175 గిగావాట్ల కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదని ప్రభుత్వ లక్ష్యం.

ఇప్పటివరకు సంప్రదాయేతర ఇంధన వనరుల మార్గంలో 72 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వసతులు కల్పించగా, మరో 27 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల్లో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్రోల్ పంపుల వద్ద విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విషయమై పెట్రోలియం మంత్రిత్వశాఖతోనూ సమన్వయంతో తమ శాఖ పని చేస్తున్నదని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తెలిపారు. 

ఈఈఎస్‌ఎల్‌కు ఏడీబీ 13 మిలియన్ డాలర్ల రుణం
నూతన పరిశోధనలు, బిజినెస్ పద్దతిని విస్తరించడానికి ఈఈఎస్‌ఎల్(ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో 13 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ కేటాయించనున్నది.

అంతర్జాతీయంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈఈఎస్‌ఎల్ వర్గాలు వెల్లడించాయి. దీంతో హోటల్స్, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, కమర్షియల్ మాల్స్, కమర్షియల్/ప్రభుత్వ భవంతులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, విద్య ఇనిస్టిట్యూట్‌లు, డాటా సెంటర్‌లతో పాటు ఇతర వాటికి ప్రయోజనం కలుగనున్నది.

click me!