తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

By ramya neerukondaFirst Published Aug 28, 2018, 2:27 PM IST
Highlights

భాగస్వామ్యంలో ఎక్కువ బాధ్యత వీరిదే ఉంటుంది. అందరు చెప్పిన మాటలు విని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు ఉండదు.

పొడవుగా సౌష్టవం కలిగిన శరీరం, అవయవ భాగాలు సన్నగా కనిపించినా బలిష్టంగా ఉండడం, చిరునవ్వుతో అందరినీ ఆకర్షించగల నేర్పు కలిగి ఉంటారు. నిదానం, సున్నితమైన స్వభావం, నూతన విషయాలను కనిపెట్టడం, కళలపై ఆసక్తి, మంచి ఆలోచనాశక్తి, ఒక నిర్ణయానికి తొందరగా రాలేకపోవడం, ప్రతి విషయంలో న్యాయాన్యాయాలు బేరీజు వేయడం, కొంత బద్ధకం, పరోపకార చింతన, పరువు ప్రతిష్టకోసం తాపత్రయ పడడం, అందరితో కలిసిపోయే తత్త్వం, సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆశయాలు అధికంగా పెట్టుకోవడం, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అనే ఆలోచన లేకుండా అన్ని పనులు తాము చేసే తత్త్వం కలిగి ఉంటారు.

వీరికి సామాజిక అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఎక్కువ బాధ్యత వీరిదే ఉంటుంది. అందరు చెప్పిన మాటలు విని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు ఉండదు. వేరు వేరు అంశాల్లో సామరస్యాన్ని కనబరుస్తూ ముందుకూ వెళుతూ ఉంటారు. అన్నిటిలో మంచి ప్రతిభను కనబరుస్తారు.

వీరికి అనుకున్న పనులు సమయానికి జరుగకపోయే సరికి నిరాశకు గురి అయి ఎవ్వరూ నా మాట వినడం లేదు అనే నిరాశ, నిస్పృహకు లోనౌతూ, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తూలారాశి సహజ సప్తమభావమై ఉన్నప్పుడు.ఉదా : నాకు వైవాహిక సౌఖ్యం, సంతృప్తి సరిగా లేదు - భార్య / భర్తతో అంతర్గత అనుబంధంలో లోపాలున్నాయి - భాగస్వాములు నన్ను ఇబ్బంది పెడుతున్నారు - స్నేహితులు దూరమౌతున్నారు - అనుబంధాలన్నీ సమస్యలుగా మారుతున్నాయి వంటి సమస్యలు సప్తమభావానికి సంబంధించిన లోపాలుగా లోకంలో వినిపిస్తుంటాయి.

సప్తమాధిపతి షష్ఠ, అష్టమ, వ్యయాల్లో ఉన్నా, సప్తమంలో త్రికస్థానాధిపతులున్నా, సప్తమాధిపతి వక్రంలో ఉన్నా, సప్తమంలో వక్ర గ్రహాలున్నా, సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రాదుల్లో ఉన్నా, సప్తమాధిపతి త్రిక స్థానాధిపతులతో, అశుభగ్రహాలతో సంబంధాలను పొంది ఉన్నా వైవాహిక, భాగస్వామ్యాది అనుబంధాల్లో లోపాలకు జాతకపరంగా అవకాశాలు ఉంటాయి.

వైవాహిక అనుబంధాలను అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించడం, సమాజ వ్యతిరేకమైన అనుబంధాలను పొందడం, కళత్రాన్ని వేరు వేరు రూపాల్లో వేధించడం, వ్యాపార భాగస్వాములను మోసం చేయడం, స్నేహితులను తమ స్వార్థాదులకోసం ఉపయోగించుకొని వారిని ఇబ్బందులకు గురి చేయడం, ప్రకృతిని నిందించడం వంటి లోపాలు పూర్వకర్మలలో చేయడం వల్ల ప్రస్తుతం సప్తమభావ లోపాలున్న సమయంలో జన్మించే అవకాశాలుంటాయి.

భాగస్వామిని గౌరవించడం, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించడం, అనుబంధాలకు, ఆత్మీయతలకు ప్రాధాన్యమివ్వడం, ఎదుటివారి ఆధిక్యాన్ని అంగీకరించడం, ఎదుటివారికి ముందు ప్రాధాన్యమివ్వడం, అవకాశం ఇవ్వడం, ఎదుటి వ్యక్తి మేలు కోసం నిరంతరం ప్రార్థనలు చేస్తుండడం వంటి కార్యనిర్వహణల వల్ల జ్యోతిర్వైద్య ప్రక్రియలో పరిష్కారం ఉంటుంది.

ఈ సృష్టిలో ఎక్కువ తక్కువలు ఎవరూ లేరు, ప్రకృతి అందరికీ, అన్ని విషయాల్లోనూ సమమైన గుర్తింపును ఆనందాన్నిస్తుంది. శరీరంలోనూ అన్నీ సమభాగాలే. వైవాహిక, భాగస్వామ్యాల్లోనూ అందరూ సమభాగులే. అందరికీ సమ ప్రాధాన్యమివ్వడమే జీవన లక్ష్యం అనే భావనను పొందడం ద్వారా లోపనివారణలకు అవకాశం ఉంటుంది.ఎవరి తత్త్వాలు వారు తెలుసుకుని అందరినీ అనుకూలమైన ధోరణిలో ప్రవర్తించేటట్లు చేసుకోవడం మంచిది.

డా.ప్రతిభ

read more news

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

click me!