ఎపి అసెంబ్లీ ఎన్నికలు: ప్రత్యేక హోదా నినాదం ఎవరి సొత్తు?

By telugu teamFirst Published Mar 7, 2019, 4:26 PM IST
Highlights

ఎపి శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది ప్రధాన నినాదం కానుంది. ఈ నినాదం ఎవరికి ఉపయోగపడుతుందనేది ఆలోచించాల్సిన విషయమే.  ప్రత్యేక హోదా విషయంలో బిజెపికి ఎదురుగాలి వీస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటోంది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఎన్నికల ప్రకటన తేదీలు వెలువడకుండానే ఎపిలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. కాంగ్రెసు నామమాత్రమే కావచ్చు. బిజెపి కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు

ఎపి శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది ప్రధాన నినాదం కానుంది. ఈ నినాదం ఎవరికి ఉపయోగపడుతుందనేది ఆలోచించాల్సిన విషయమే.  ప్రత్యేక హోదా విషయంలో బిజెపికి ఎదురుగాలి వీస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటోంది. 

అయితే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు. యువతను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు కూడా చేశారు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. 

కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడంతో బిజెపితో స్నేహం చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ దానికి సరేనంది. పైగా, ప్రత్యేక హోదా సంజీవిని ఏమీ కాదని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. 

ఎన్డీఎ నుంచి తప్పుకున్న తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని ఆయన ప్రస్తుతం వాదిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల తాను బిజెపితో తెగదెంపులు చేసుకున్నానని ఆయన చెబుతూ వస్తున్నారు. ప్రజలు చంద్రబాబు వాదనను ఏ మేరకు అంగీకరిస్తారనేది ఎన్నికల ఫలితాలే తెలియజేస్తాయి. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే, పార్టీ ఫిరాయింపులు, విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై దాడి వివాదం, తాజాగా డేటా చోరీ వివాదం వంటివి ముందుకు వచ్చి ప్రత్యేక హోదా నినాదం వెనక్కి వెళ్లిపోయింది. కానీ ఎన్నికల నాటికి అది తిరిగి ప్రధాన ఎజెండగా మారుతుందనడంలో సందేహం లేదు. 

తాము అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాను బిజెపి ఇవ్వబోదని, తమ పార్టీ మాత్రమే ఇస్తుందని కాంగ్రెసు ఎపి నాయకులు చెబుతున్నారు. అయితే, ప్రజలు కాంగ్రెసును ఆదరిస్తారా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎపిలో కాంగ్రెసు తిరిగి బలం పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ పార్టీ నాయకులు అటు తెలుగుదేశంలోకో ఇటు వైసిపిలోకో వెళ్లిపోతున్నారు. 

జగన్ మాత్రం ఎటూ తేల్చకుండా నర్మగర్భంగా ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో తమ పార్టీ మద్దతు ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెసుతో కలవడానికి ఆయన సిద్ధంగా లేరు. అయితే, ప్రత్యేక హోదా నినాదం ఏ పార్టీకి ఉపయోగపడుతుందనేది చెప్పడం మాత్రం కష్టంగానే ఉంది. 

click me!