అక్కడ నుంచి నాన్ లోకల్ పోటీ చేస్తే మంత్రి పదవి దక్కడం ఖాయం

By Nagaraju penumalaFirst Published Mar 18, 2019, 3:55 PM IST
Highlights

ఈ నియోజకవర్గం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే కచ్చితంగా మంత్రి పదవులు దక్కించుకోవడం ఖాయమట. పోటీ చేసిన వాళ్లు మంత్రి అయిపోరు స్థానికేతరులు అయితే మాత్రమే మంత్రి అవుతారట. మంత్రి పదవితోనే సరిపెట్టలేదు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి సైతం అయ్యారంటే ఆ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది కదూ.

నెల్లూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే చాలు అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే. అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనేదానిపైనే చర్చ జరుగుతుంది. కానీ ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ స్థానికేతరుడిని బరిలోకి దింపుతోందా అని ఆసక్తిగా చర్చించకుంటారట. 

ఎందుకంటే స్థానికేతరుడు పోటీ చేసిన పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగిరి దక్కడం ఖాయమట. ఇదే సెంటిమెంట్ ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సెంట్మెంట్ ను కొనసాగిస్తోంది నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం. వెంకటగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 

ఈ నియోజకవర్గం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే కచ్చితంగా మంత్రి పదవులు దక్కించుకోవడం ఖాయమట. పోటీ చేసిన వాళ్లు మంత్రి అయిపోరు స్థానికేతరులు అయితే మాత్రమే మంత్రి అవుతారట. మంత్రి పదవితోనే సరిపెట్టలేదు. 

వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి సైతం అయ్యారంటే ఆ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది కదూ. ఒకవేళ స్థానికులు గనుక పోటీ చేస్తే వారు కేవలం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారట. 

1978లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి 1983లో పోటీ చేసి గెలుపొందిన నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి సైతం మంత్రి పదవిని దక్కించుకున్నారట. 

ఆ తర్వాత 1989 ఎన్నికల్లో విజయం సాధించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిసైతం మంత్రి పదవిని దక్కించుకున్నారు. మెుదట వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహించారు. 

2004 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి సైతం మంత్రి పదవి దక్కించకున్నారు. ఆమె రాష్ట్ర ప్రాథమిక విద్య, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానికేతరుడు అయిన ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. 

ఈయన గతంలో అనేకసార్లు మంత్రిగా పని చేశారు. ఇకపోతే వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన స్థానికులు పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, ఓరేపల్లి వెంకటసుబ్బయ్య, అల్లం కృష్ణయ్య, వీబీ సాయికృష్ణ యాచేంద్ర, వీవీఆర్‌కే యాచేంద్రతో పాటు వరుసగా రెండు దఫాలు గెలుపొందినా మంత్రులు కాలేకపోయారు. 

ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.రామకృష్ణకు సైతం మంత్రి పదవి దక్కలేదు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ప్రభుత్వ కీలక పదవులు కూడా చేపట్టలేదు. కేవలం వారు ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయారు. 

అయితే ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి స్థానికేతరుడు పోటీ చేస్తుండటంతో తాజాగా సెంటిమెంట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. మరి ఆ సెంటిమెంట్ ఆనం రామనారాయణరెడ్డి విషయంలో వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి. 

click me!