బాబాయ్ వారసుడిగా రామసుబ్బారెడ్డి: ఈ సారి పాగా వేస్తారా

By narsimha lodeFirst Published Mar 11, 2019, 4:42 PM IST
Highlights

కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో  మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు

జమ్మలమడుగు: కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో  మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మాజీ మంత్రి పి. రామ సుబ్బారెడ్డి.వరుసగా ఈ స్థానం నుండి మూడు దఫాలు ఓటమి పాలైన రామసుబ్బారెడ్డి మరోసారి ఇదే స్థానం నుండి  బరిలోకి దిగుతున్నారు. తన ప్రత్యర్ధి ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు. 

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి కుటుంబానికి ఆదినారాయణరెడ్డి కుటుంబానికి ఏళ్ల తరబడి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ గొడవల్లో రెండు వర్గాలకు చెందిన అనేక మంది హత్యకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. ఒకరిపై మరోకరు కేసులు కూడ పెట్టుకొన్నారు.

రామసుబ్బారెడ్డి బాబాయ్ శివారెడ్డికి ఈ నియోజకవర్గంపై మంచిపట్టుండేది. 1978లో కాంగ్రెస్ అభ్యర్ధిగా శివారెడ్డి పోటీ చేసి  జనతా పార్టీ అభ్యర్ధి రామనాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. టీడీపీ ఆవిర్భావంతో శివారెడ్డి ఆ పార్టీలో చేరారు.

1983లో శివారెడ్డి ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి నర్సింహ్మారెడ్డిపై ఆయన నెగ్గారు. 1985లో, 1989లో కూడ ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా శివారెడ్డి  విజయం సాధించారు. 1994 ఎన్నికలకు ముందు శివారెడ్డి హైద్రాబాద్ సత్యసాయి నిగమాగం వద్ద ప్రత్యర్ధులు నరికి చంపారు.

దీంతో శివారెడ్డి సమీప బంధువు రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో  పోటీ చేసి ప్రత్యర్థి నారాయణరెడ్డిపై నెగ్గారు.1999 ఎన్నికల్లో కూడ రామసుబ్బారెడ్డి ఈ స్థానం నుండి మరోసారి నెగ్గారు. చంద్రబాబునాయుడు కేబినెట్‌లో రామసుబ్బారెడ్డి ఉన్న సమయంలోనే షాద్‌నగర్ జంటహత్యల కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో  మంత్రి పదవి నుండి తప్పుకొన్నారు.

2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రామసుబ్బారెడ్డి ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడ రామసుబ్బారెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. దీంతో బాబు కేబినెట్‌లో ఆది నారాయణరెడ్డికి మంత్రి పదవి లభించింది.  ఈ ఇధ్దరు ప్రత్యర్థులుగా ఉన్న ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో  ఇద్దరి మధ్య చంద్రబాబు రాజీ ఫార్మూలా కుదిర్చారు.

దరిమిలా మరోసారి జమ్మలమడుగు నుండి రామసుబ్బారెడ్డి టీడీపీ అభ్యర్ధిగా మరోసారి బరిలోకి దిగారు. కడప ఎంపీ స్థానం నుండి మంత్రి ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగారు.జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గెలుపుకు ఆదినారాయణరెడ్డి వర్గం పనిచేయాలి,  ఆదినారాయణరెడ్డి ఎంపీ స్థానానికి పోటీచేస్తున్నందున రామసుబ్బారెడ్డి వర్గం ఆదినారాయణరెడ్డి వర్గానికి సపోర్ట్ చేయాలని బాబు సూచించారు. 


 

click me!