మైలవరంలో దేవినేని ఉమ ఈసారి గట్టెక్కుతారా..?

By Siva KodatiFirst Published Mar 11, 2019, 2:09 PM IST
Highlights

2014 ఎన్నికల్లో వైసీపీ నేత జోగి రమేశ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. అయితే ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో దేవినేని ఉమకు ప్రతికూలంగా మారింది. 

తెలుగుదేశం పార్టీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించే వ్యక్తి దేవినేని ఉమా మహేశ్వరరావు. పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణాజిల్లాలో టీడీపీని ముందుండి నడిపించారు ఉమ. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ నేతల్లో ఒకరిగా నిలిచారు. 

తొలుత నందిగామ నుంచి గెలిచిన దేవినేని.. ఆ తర్వాత తన రాజకీయ క్షేత్రాన్ని మైలవరానికి మార్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నేత జోగి రమేశ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. అయితే ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో దేవినేని ఉమకు ప్రతికూలంగా మారింది. 

ఇక్కడ తనకు ఎవరూ పోటీ ఉండరని భావించిన దేవినేనికి సామాజికంగా, ఆర్ధికంగా బలమైన నేత పోటీ నిచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతున్నారన్న చర్చ నడుస్తోంది. వరుసపెట్టి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న మంత్రి దేవినేనికి, అంతే స్థాయిలో పేరున్న వసంత కృష్ణప్రసాద్‌ కాకపుట్టిస్తున్నారు.

మైలవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమను ఓడించాలని వైసీపీ చీఫ్ జగన్ కంకణం కట్టుకున్నారు. అందుకే తొలి నుంచి ఇక్కడ ఉన్న నేతకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు అవకాశం ఇచ్చి జగన్ వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారు.

ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆర్ధికంగా బలమైన వ్యక్తులు కావడంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. వసంత నుంచి తనకు ఎర్త్ తప్పదని భావించిన దేవినేని మీడియాలో తరచుగా కృష్ణప్రసాద్‌ను టార్గెట్ చేస్తున్నారు.

వారానికోసారి కూడా నియోజకవర్గానికి రారని, ఆయనకు ఓటు వేస్తే.. హైదరాబాద్‌లోనే గడిపేస్తారని వారాలబ్బాయి అంటూ వసంతను ఉమ విమర్శించారు. దీనికి కౌంటర్‌గా మంత్రి ఉమ రాజకీయాల్లోకి రాకపోముందు షోడాలను కొట్టేవారన్న విషయం నందిగామలో అందిరికీ తెలుసునని విమర్శించారు. 

షోడాల బండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారా.. తనను విమర్శించేది అంటూ ఫైరయ్యారు. మరోవైపు మంత్రి దేవినేని పనితీరుపై నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనం పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు సోమవారం మంత్రి దేవినేని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్‌ను స్వయంగా వెంటబెట్టుకుని మరీ వైసీపీలో చేర్చించారు కృష్ణప్రసాద్. 

వైసీపీలో చేరి వస్తూ వస్తూనే అన్న అవినీతి గురించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు చంద్రశేఖర్. సొంత తమ్ముడు ప్రత్యర్థి పార్టీలో చేరడంతో ఉమ పరిస్థితి క్లిష్టంగా తయారైంది. మరి రాబోయే రోజుల్లో మైలవరం రాజకీయాలు ఎటు వైపు మలుపు తిరుగుతాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

click me!