ప్రాణం తీసిన ఈత సరదా... కృష్ణా నదిలో కొట్టుకుపోయి యువకుడు మృతి

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2021, 03:54 PM ISTUpdated : Nov 09, 2021, 04:03 PM IST
ప్రాణం తీసిన ఈత సరదా... కృష్ణా నదిలో కొట్టుకుపోయి యువకుడు మృతి

సారాంశం

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. నదిలో కొట్టుకుపోయిన రెండురోజుల తర్వాత యువకుడి మృతదేహం లభించింది. 

గుంటూరు: సెలవురోజు కావడంతో గత ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు నదీతీరానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. ఈత రాకపోయిన స్నేహితులతో కలిసి నదిలోకి దిగి గల్లంతయ్యాడు. రెండురోజుల తర్వాత అంటే ఇవాళ అతడి మృతదేహం లభ్యమయ్యింది. 

వివరాల్లోకి వెళితే... guntur district అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్(22) గత ఆదివారం స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈత రాకపోయినా స్నేహితులతో కలిసి krishna river లోకి దిగి నీటితో సరదాగా ఆడుకుంటూ లోతులోకి వెళ్లాడు రిజ్వాన్. దీంతో నీటమునిగి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. 

రిజ్వాన్ ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. అయినప్పటికి సాధ్యం కాకపోవడంతో గ్రామానికి వెళ్లిన పెద్దలకు విషయం తెలిపారు. దీంతో అందరూ ఘటనాస్థలికి చేరుకుని రిజ్వాన్ కోసం గాలించారు. ఆదివారం రాత్రి వరకు గాలించినా రిజ్వాన్ ఆచూకీ లభించలేదు. 

read more  మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఇద్దరు యువకులను బంధించిన కుటుంబీకులు

గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు నిన్న(సోమవారం) ఘటనాస్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో రిజ్వాన్ మృతదేహంకోసం గాలించారు. వారు కూడా రాత్రివరకు గాలించినా ఫలితంలేకుండా పోయింది. అయితే ఇవాళ(మంగళవారం) ఘటన జరిగిన స్థలానికి అర కిలోమీటర్ దూరంలో రిజ్వాన్ మృతదేహం లభ్యమయ్యింది. 

మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమరావతి ఎస్సై కోటేశ్వ రరావు తెలిపారు. యువకుడి మృతితో దిడుగు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

ఇక ఇటీవల హైదరాబాద్ శివారులో కూడా ఇలాగే ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సజ్జలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సరదాగా ఈత కొట్టడానికి వెంకటాపూర్ సమీపంలోని ఈసీ వాగు కత్వలో దిగారు. అయితే ఇద్దరు యువకులు బాగా లోతులోకి వెళ్లడంతో మునిగిపోయి గల్లంతయ్యారు. మరో యువకుడు మాత్రం నీటిలోంచి సురక్షితంగా బయటకు వచ్చాడు. 

read more  కరీంనగర్: మృత్యువును జయించిన ఆ నలుగురు... ఒకేసారి యాక్సిడెంట్, అగ్నిప్రమాదం చుట్టుముట్టినా

ప్రాణాలతో బయటపడ్డ యువకుడు గ్రామంలోకి వెళ్లి తన స్నేహితులిద్దరు నీటమునిగి గల్లంతయిన విషయాన్ని తెలిపాడు. దీంతో అందరూ కలిసి వెళ్లి వెతికినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో యువకులిద్దరి కోసం గాలింపు చేపట్టారు. దీంతో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

ఇలా నేటి యువత సరదా కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఓ యువకుడు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకరంగా సెల్ఫీ దిగుతూ నీటిలో పడ్డాడు. కాపాడేందుకు సోదరుడు కూడా నీటిలోకి దూకాడు. అయితే సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడిని ప్రాణాలతో బయటపడ్డా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు మాత్రం మృతిచెందాడు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్