
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినబడకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ కంచుకోటైన పులివెందులలో పైడిపాలెం రిజర్వాయర్ నుండి చంద్రబాబు నీటిని విడుదల చేసారు. అయితే, ఈ కార్యక్రమాంలో హాజరయ్యేందుకు అవకాశం లేకుండా కడప వైసీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఎందుకు అరెస్ట్ చేసారంటే పోలీసులు చెప్ప లేదు.
అయితే ఈ విషయమై వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున నిరపన వ్యక్తం చేసాయి. దాంతో వైసీపీ ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ప్రభుత్వం అవినాష్ తదితరులను విడుదల చేసింది. దాంతో అవినాష్ సిఎం సభలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిఎం పాల్గొనేే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లేకుండా ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేయటమనే చెడ్డ సంప్రదాయానికి టిడిపి తెర ఎత్తటం గమనార్హం.
నీటి విడుదల కార్యక్రమంలో మామూలుగా అయితే అవినాష్ రెడ్డి కూడా పాల్గొనాలి. ఎందుకంటే, పార్టీ రహితంగా ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలోని అందరు ప్రజాప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే, గడచిన కొంత కాలంగా చంద్రబాబు ప్రారంభిస్తున్న ప్రాజెక్టుల్లో అత్యధికం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మొదలుపెట్టినవే. అయితే, ఆ విషయం చెప్పకుండా, వైఎస్ ప్రస్తావన తేకుండా మొత్తం తన ఘనతగానే చంద్రబాబు చెప్పుకుంటున్నారు.
ఈ విషయంపైనే ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మొన్న కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ప్రాజెక్టును సిఎం ప్రారంభించారు. అయితే, ఆనవాయితీకి భిన్నంగా వైసీపీ ఎంఎల్ఏ ఐజయ్యను వేదికపైకి పిలిచారు. గడచిన రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిధులను ఎవరినీ ప్రభుత్వం వేదికమీదకు పిలవటం లేదు. ఎంఎల్ఏ మాట్లడుతూ, ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభించినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూనే, అసలు ప్రాజెక్టును మొదలుపెట్టి చాలా భాగం పూర్తి చేసింది వైఎస్సే అని చెప్పారు. దాంతో చంద్రబాబుకు మండిపోయింది. వెంటనే ఐజయ్యకు మైక్ కట్ చేసేసి వేదికపై నుండి దింపేసారు.
అప్పటి అనుభవం గుర్తుందేమో, అందుకనే ఎంపిని ముందుజాగ్రత్తగానే అరెస్ట్ చేసారు. ఎంపిని అరెస్టు చేయకపోతే అవినాష్ కూడా వేదికపైకి వస్తారు. అప్పుడు ప్రాజెక్టును నిర్మించింది వైఎస్సే అంటూ మళ్ళీ చెబుతారు. వాస్తవమే అయినా వినటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఎందుకొచ్చిన తంటా అనుకున్నరో ఏమో ముందుజాగ్రత్తగా ఎంపితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసేసారు. దాంతో వైఎస్ ఊసే లేకుండా కార్యక్రమం దిగ్విజయంగా సాగిపోయింది.
అయినా ప్రభుత్వం పిచ్చిగానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎవరు మొదలుపెట్టారు? ఎవరు ప్రారంభిస్తున్నారన్న విషయం అందరికీ గుర్తు ఉండకపోవచ్చు. కానీ తమ జిల్లాల్లో ప్రాజెక్టులను ఎవరు మొదలుపెడితే ఎవరు ప్రారంభిస్తున్నరాన్న విషయం ఇంకోరు చెప్పాలా?