
అధికార పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా పెరిగిపోతున్నాయంటే చివరకు సొంత పార్టీ నేతలే భరించలేనంతగా. ఇటువంటి వారికి సిఎం మద్దతు ఉందన్న ప్రచారం తోడవటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. దాంతో వీరు మరీ రెచ్చిపోయి చివరకు సొంత పార్టీ నేతలు అని కూడా చూడటం లేదు. దాంతో ఇటువంటి వారి వ్యవహారం ఇంటా, బయట కూడా తలనొప్పిగా తయారయ్యింది.
అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతున్నవారిలో చింతమనేని ప్రభాకర్, అన్నం సతీష్, కోడెల శివరామకృష్ణతో పాటు గుంటూరు, చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో నేతలున్నారు. పార్టీలో నేతల మధ్య గొడవలు ముదిరిపోయినపుడు అందరూ కలిసి రోడ్డునపడుతున్నారు.
అటువంటి సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. చింతమనేని అరాచకాలను తట్టుకోలేక ఏకంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధితో పాటు కొందరు నేతలు మీడియా సమావేశంలోనే విరుచుకుపడ్డారు. అధికార ప్రతినిధి అప్పలనాయడు మాట్లాడుతూ చింతమనేనికి హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం.
సామాన్య ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం వ్యవహరించినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబట్టేందుకు చింతమనేని రూ. 40 లక్షలు దండుకున్నట్లు బహిరంగంగానే ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షురాలు అనూరాధను తప్పిస్తే ఊరుకునేది లేదని కూడా అన్నారు.
మొన్ననే ఎంఎల్సీ అన్నం సతీష్ గుంటూరు జిల్లాలోని ఓ రిసార్ట్స్ లో సిబ్బందిని కొట్టారు. గన్నవరంలో మాజీ ఎంఎల్ఏ రావి వెంకటేశ్వర్ రావు ఓ క్లబ్ లో జరిగిన వివాదంలో తుపాకితో కాల్చారు. అయితే, అది మిస్ ఫైర్ అవ్వటంతో ఎవరు గాయపడలేదు. గుణదల, గన్నవరం తదితర ప్రాంతాల్లోని నేతలు కొందరు పోలీసులనే రోడ్డుపై పడేసి కొట్టారు. గుంటూరులో మంత్రి రావెల కిషోర్ బాబు, జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ మద్దతుదారులు జన్మభూమి కార్యక్రమాల్లోనే కొట్టేసుకున్నారు. స్పీకర్ కుమారుడు కోడెల శివరామకృష్ణపై ఉన్న ఫిర్యాదులు అన్నీ ఇన్నీ కావు.
చిత్తూరు జిల్లాలోని పాకాల మండలంలో కొందరు నేతలు పబ్లిక్ గా పోలీసులను చితకబాదారు. వారి నుండి రక్షించుకునేందుకు చివరకు పోలీసులే పారిపోవాల్సి వచ్చింది. గుంటూరులో రెవిన్యూ సిబ్బందిపై పలువురు నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇక, మిగిలిన జిల్లాల్లోనూ నేతల అరాచకాలు ఏమీ తక్కువగా లేవు. కాకపోతే పార్టీ నేతల అరాచకాల్లో బయటపడుతున్నవి కొన్నిమాత్రమే.