
ఈ విషయంలో వైసీపీ ఛీఫ్ జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందే. వైసీపీలోకి చేరేవారెవరైనా సరే పార్టీతో పాటు తమ పదవులకు కూడా రాజీనామా చేయాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా చక్రపాణిరెడ్డికి కూడా జగన్ అటువంటి సూచనే స్పష్టంగా చేసారు. టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డిని ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షరతు విధించారు.
బుధవారం మధ్యాహ్నం చక్రపాణి టిడిపికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత నంద్యాలలో బయలుదేరి రాత్రికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చక్రపాణి తదితరులు చేరుకున్నారు. పలకరింపులు, అభినందనలు అయిన తర్వాత జగన్-చక్రపాణి మధ్య ఏకాంత సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో జిల్లాలోని పరిస్ధితులు, నంద్యాలలో గెలుపు అవకాశాలతో పాటు సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి గెలుపుకు తాను చేయనున్న కృషిని కూడా చక్రపాణి, జగన్ కు వివరించారట.
అంతా అయిపోయిన తర్వాత జగన్ మాట్లాడుతూ, ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందిగా చక్రపాణి రెడ్డికి సూచించారట. ‘ఫిరాయింపులపై ఇంతకాలం టిడిపిని జాతీయ స్ధాయిలో విమర్శిస్తున్న మనం టిడిపి దారిలోనే నడిస్తే వారికి మనకు తేడా ఉండద’ని చెప్పారట. చక్రపాణి రాజీనామా ద్వారా ఖాళీ అయ్యే స్ధానంలో ఎన్నిక జరిగితే గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ కూడా జగన్ ఇచ్చారట. ‘వైసీపీలో చేరాలనుకున్న ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి ఉండాల్సిందే’నంటూ ఖచ్చితంగా జగన్ చెప్పారట. మరిక చక్రపాణిరెడ్డి ఏం చేస్తారో చూడాలి.