
రాజధాని నిర్మాణంపై చంద్రబాబునాయుడు వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఉన్నది ఇక రెండేళ్ళే. 2018లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబే సంకేతాలు పంపుతున్నారు. అంటే చంద్రబాబు లెక్కల ప్రకారమే ప్రభుత్వం ఉండేది మహా అయితే ఇంకో ఏడాది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో ఐదేళ్ళు. లేకపోతే ప్రతిపక్షస్ధానమే. ఇటువంటి పరిస్ధితుల్లో చంద్రబాబు ఎంత స్పీడ్ గా ఉండాలి? ప్రపంచస్ధాయి రాజధాని నిర్మించే భాగ్యం, అదృష్టం తనకు దక్కిందని ఎన్నోమార్లు చెప్పుకున్నారు. మాటల్లో ఉన్న స్పీడ్ చేతల్లో ఏది?
సిఎం అయిన దగ్గర నుండి ఇప్పటికే ఎన్నో డిజైన్లు చూసారు. ప్రతీ డిజైన్ పైనా అసంతృప్తే. తాజాగా బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫొస్టర్ తయారుచేసిన డిజైన్లపైన కూడా మంత్రివర్గంలో సానుకలత లేదు. అంటే ఈ డిజైన్లను కూడా నార్మన్ మార్చాల్సిందే. ఇలా మార్చుకుంటే పోతే పుణ్యకాలం అయిపోతుందే కానీ డిజైన్లు మాత్రం ఖరారు కావన్నది సత్యం. ఎందుకంటే, తానే స్వయంగా ఎన్నో దేశాలు తిరిగి రాజధానులను పరిశీలించారు. ఉన్నతాధికారుల బృందాలను ఎన్నో దేశాలకు పంపించారు. ఈ పర్యటనలకు అంతా వందల కోట్ల రూపాయలు ఖర్చయింది తప్ప ఏమాత్రం ఉపయోగం కనబడలేదు.
ఆర్కిటెక్టులను కూడా ఎందరినో మార్చారు. సింగపూర్ డిజైన్లన్నారు. తరువాత జపాన్ నుండి మాకీ అసోసియేట్స్ అన్నారు. మలేషియా నుండి ఓ ఆర్కిటెక్ట్ వచ్చి స్వచ్చంధంగా తాను డిజైన్లను ఇస్తానన్నారు. చివరకు బ్రిటన్ డిజైనర్ నార్మన్ ఫొస్టర్ బ్రహ్మాండమన్నారు. ఆయనిచ్చిన డిజైన్లలో కూడా రెండు మూడుసార్లు మార్చారు. ఇలా అయితే, డిజైన్లు ఎప్పటికీ ఫైనల్ కావు. ఎందుకంటే, ప్రపంచస్ధాయి అనే పదానికి కొలమానమే లేదు. ఒకదానికి మించి మరోటి ఎప్పటికీ బాగానే ఉంటుంది.
కాబట్టి మన అవసరాలు, మన ఆర్ధిక స్ధోమత, మన వాతావరణ పరిస్ధితులకు తగ్గట్లుగా వేయమనుంటే ఈ పాటికే డిజైన్లు ఖరారయ్యేవి. ప్రపంచస్ధాయి, ప్రపంచస్ధాయి అంటూ పరుగెట్టి చివరకు రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయకుండానే ఎన్నికలు ఎదుర్కుంటారేమో. ఆలోచనల్లో స్పష్టత లేకపోయినా, నేల విడిచి సాము చేద్దామనుకున్నా పరిస్ధితులు ఇలానే ఉంటాయి. ఈ ఏడాదిలోగా డిజైన్లు ఖరారు చేసి పనులు మొదలుపెట్టకపోతే ఇక చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి నీళ్ళు వదిలేయాల్సిందే.