ఎంఎల్ఏకే సవాలు విసిరిన ఎస్పీ (వీడియో)

Published : Apr 22, 2017, 04:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఎంఎల్ఏకే సవాలు విసిరిన ఎస్పీ (వీడియో)

సారాంశం

‘అవసరమైతే తనపై సిబిఐకి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చం’టూ ఎంఎల్ఏకే సవాలు విసిరారు. పైగా ‘అందరి ముందు తనను నిలదీస్తారా’ అంటూ ఎంఎల్ఏపైనే మండిపడ్డారు.

ఆవిడ ఒక ఎస్పీ, ఆయనొక ఎంఎల్ఏ.  ఎస్పీ అంటేనే ప్రజా సేవకురాలు. ఎంఎల్ఏ అంటే ప్రజా ప్రతినిధి. ప్రజా ప్రాతినిద్య చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధి ప్రశ్నకు సేవకులు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే, ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు. ప్రజా సేవకులు ఆ చట్టాలను పాటిస్తారు. అంటే ప్రతినిధులకన్నా సేవకులే మిన్న అని రాజ్యాంగం కూడా చెప్పింది. కానీ జరుగుతున్నది మాత్రం భిన్నం. అందునా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులంటే అధికారులు ఎవరూ లెక్క కూడా చేయటం లేదు. పైగా వారిపైకే సవాళ్ళు విసురుతున్నారు. తిరుపతిలో జరిగిన ఓ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. 

ఉన్నతాధికారుల్లో కూడా అసహనం చోటు చేసుకుంటున్నట్లుంది. తామేం చేసినా, ఏమీ చేయకపోయినా తమను మాత్రం ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంది వారి వైఖరి. వైసీపీ ఎంఎల్ఏ నాయారణస్వామికి ఎస్పీకి మధ్య జరిగిన సంభాషణే ఉన్నతాధికారుల ఆలోచన ఏమిటో చెప్పకనే చెబుతోంది. తాజాగా ఏర్పేడులో దుర్ఘటనలో 15 మంది మృతిచెందారు. మృతుల బంధువులను పరామర్శిచేందుకు వైసీపీ ఎంఎల్ఏ నారాయణరెడ్డి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడ తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఎదురుపడ్డారు.

వెంటనే ఎంఎల్ఏ మాట్లాడుతూ, ‘మేడం మీరు సకాలంలో స్పందించి ఉంటే పరిస్ధితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాద’ని అన్నారు. ‘ఇసుక మాఫియపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు’? ‘ఎందుకు ఎవరిపైనా యాక్షన్ తీసుకోలేదు’ ? అంటూ ప్రశ్నించారు. ఇంతలో అక్కడే ఉన్న మీడియా కూడా వీరిద్దరి వద్దకు చేరుకుంది. దాంతో అందరి ఎదుట తనను ఓ ఎంఎల్ఏ ప్రశ్నించటాన్ని ఎస్పీ అవమానంగా భావించినట్లున్నారు. దాంతో రెచ్చిపోయారు.

‘జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ప్రమాదం జరిగిన ఐదు నిముషాల్లోనే తాను చేరుకున్నట్లు’ చెప్పారు. ‘అవసరమైతే తనపై సిబిఐకి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చం’టూ ఎంఎల్ఏకే సవాలు విసిరారు. పైగా ‘అందరి ముందు తనను నిలదీస్తారా’ అంటూ ఎంఎల్ఏపైనే మండిపడ్డారు. ఎంఎల్ఏ బదులిస్తూ ‘మేడం తాను ఎంఎల్ఏని’ అంటూ గుర్తు చేయగా ‘తాను కూడా యూనిఫారం వేసుకున్న లేడి ఎస్పీ’ అని బదిలిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో నుండి ఎప్పటి నుండో అక్రమ పద్దతిలో ఇసుకను తవ్వుకుంటున్నారు. ఇదే విషయమై చుట్టుపక్కల వారు ఎన్నోమార్లు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇపుడు ప్రమాదానికి కారణం కూడా ఇసుక మాఫియానే అంటూ ఆరోపణలు వినబడుతుండటం గమనార్హం. ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వచ్చిన వారిపైనే ఇసుక లారీ దూసుకు పోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu