
చంద్రబాబునాయుడు వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుంది. తప్పు చేసింది తనవారైతే ఒకలా, పరాయి వారైతే ఇంకోలా వ్యవహరిస్తుంటారు. మంచినీళ్ల కోసం హిందుపురం పట్టణంలో మొన్న నిరసన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్ కమీషనర్, ఛైర్ పర్సన్ను తప్పపట్టడమే ఇందుకు ఉదాహరణ. వారిద్దరినీ డిస్మిస్ చేసినా తప్పు లేదనటం విచిత్రంగా ఉంది. అసలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపైన కూడా సిఎం తీవ్ర అసహనం వ్యక్తం చేయటం గమనార్హం.
ఇక్కడ తప్పు చేసిందేమో నియోజకవర్గ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ. గెలిచిన దగ్గర నుండి ఏదో చుట్టపుచూపుగా తప్ప ఏనాడు నియోజకవర్గ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ సమస్య వచ్చినా మొన్నటి వరకూ మాజీ పిఏ చంద్రశేఖర్ పైనే వదిలేసారు. పట్టణంలో మంచినీటి సమస్య పెరిగిపోతోందని ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా బాలకృష్ణ పట్టించుకోలేదు. నియోజకవర్గాన్ని గాలికొదిలేయటం బాలయ్యదే తప్పు. అయితే, చంద్రబాబు మాట్లాడుతూ, ఛైర్ పర్సన్, కమీషనర్లను డిస్మిస్ చేసినా తప్పు లేదనటం విచిత్రంగా ఉంది.
కమీషనర్-ఛైర్ పర్సన్ మధ్య విభేదాలతోనే సమస్య పరిష్కారాన్ని పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ఇద్దరి మధ్యా సమస్య ఉన్నపుడు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఎంఎల్ఏదే కదా? కనీసం కమీషనర్నైనా అక్కడి నుండి బదిలీ చేయాల్సింది. ఎందుకు చేయలేదు? పనిలో పనిగా మున్సిపల్ మంత్రి నారాయణకు కూడా చంద్రబాబు అక్షింతలేసారు.
లోకల్ ఎంఎల్ఏను కాదని మంత్రి మాత్రం ఏం చేయగలరు. పైగా తన అనుమతి లేనిదే నియోజకవర్గ వ్యవహారాల్లో ఎవ్వరూ వేలు పెట్టేందుకు లేదని గతంలోనే బాలయ్య స్పష్టంగా హెచ్చరించారు. బాలకృష్ణ అంత చెప్పిన తర్వాత ఇంకెవరైనా సమస్యలను ఎందుకు పట్టించుకుంటారు? ఇక్కడ తప్పేమైనా ఉంటే అది పూర్తిగా బలయ్యదే. అటువంటిది బాలకృష్ణను మాత్రం పల్లెత్తు మాట అనకుండా ఇతరులపై మండిపడితే ఏంటి ఉపయోగం?