
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు చేరుకున్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వీరి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి కూడా వీరిద్దరు చేరుకుని చర్చలు జరిపిన సంగతి తెలిసిందే . మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు జూపల్లి నివాసంలో లంచ్ చేశారు. అనంతరం రేవంత్, కోమటిరెడ్డి, జూపల్లిలు మీడియాతో మాట్లాడారు. రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే బీఆర్ఎస్‌ను గద్దె దించలగమని అన్నారు. తద్వారా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇంకా చాలా మంది పెద్దలు కాంగ్రెస్‌లో చేరతారనే విశ్వాసం ఉందన్నారు. జూపల్లి కృష్ణారావును కలిసి పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణలో 15 స్థానాలు గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
ALso Read: జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్, కోమటిరెడ్డి.. పార్టీలో చేరే అంశంపై ఆయన ఏమన్నారంటే..
పెద్దలు తమ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ రేపు సాయంత్రం విదేశీ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. రాహుల్ సమయం తీసుకుని.. మంచి కార్యక్రమాన్ని మంచి ముహుర్తంలో చేపడతామని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ అభివృద్ది కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం జూపల్లి పోరాడారని అన్నారు. జూపల్లి కృష్ణారావు, కూచకుళ్ల దామోదర్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చెప్పారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని జూపల్లి కృష్ణారావు చెప్పారని తెలిపారు. జూపల్లి చేరితే కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.