
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ విభజన సమస్యలపై తొలిసారి త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా .. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. వీటిపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా ఛైర్మన్‌గా త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీ తొలిసారి గురువారం సమావేశం కాబోతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సెటిల్‌మెంట్, పన్నుల విషయంలో తలెత్తిన వివాదాల పరిష్కారం, బ్యాంకుల్లో వున్న నగదు డిపాజిట్ల విభజనతో పాటు ఏపీ, తెలంగాణ క్యాష్ క్రెడిట్ అంశాన్ని చర్చించనున్నారు.
అయితే ఈ త్రిసభ్య కమిటీ భేటీకి ముందే వివాదం రేగింది. ఈ సమావేశం ఎజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దానితో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. మరి ఈ అంశాలపై సమావేశమవుతున్న త్రిసభ్య కమిటీ.. ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.
ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఈ నెల 17న జరగనున్న త్రిసభ్య కమిటీ భేటీ ఎజెండాలో మార్పులు చోటు చేసుకోవడంపై వైసీపీ ఎమ్మెల్యేలు (ysrcp) అంబటి రాంబాబు (ambati rambabu) , జోగి రమేశ్... సహా మంత్రి పేర్ని నాని, ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకొచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే.. జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారని ఆయన దుయ్యబట్టారు.
దీనిపై జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) వివరణ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండాలో ప్రత్యేక హోదా వుండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని రాంబాబు నిలదీశారు. సుజనా చౌదరి (sujana chowdary) , సీఎం రమేశ్‌లు చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.