అన్నా అంటూనే ఒకరిని.. పొగబెట్టి ఇంకొకరిని, ఇప్పటికైనా జగన్‌ని అర్ధం చేసుకోండి: సవాంగ్ బదిలీపై యనమల

Siva Kodati |  
Published : Feb 16, 2022, 06:27 PM ISTUpdated : Feb 16, 2022, 06:34 PM IST
అన్నా అంటూనే ఒకరిని.. పొగబెట్టి ఇంకొకరిని, ఇప్పటికైనా జగన్‌ని అర్ధం చేసుకోండి: సవాంగ్ బదిలీపై యనమల

సారాంశం

గౌతం సవాంగ్ బదిలీపై సంచలన  వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్ అంటూ ఎద్దేవా చేశారు. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి ఉంటుందని రామకృష్ణుడు దుయ్యబట్టారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (YS jagan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ (tdp) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu) . ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్ అంటూ ఎద్దేవా చేశారు. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి ఉంటుందని రామకృష్ణుడు దుయ్యబట్టారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గంగా వుందని.. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారని ఆయన మండిపడ్డారు.

డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారని... సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను (lv subramanyam) అన్నా అంటూనే.. గెంటేశారంటూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ (pv ramesh) , అజేయకల్లాంలను (ajeya kallam)  పొమ్మనకుండా పొగబెట్టారని... అజేయకల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించి తర్వాత పంపేశారని యనమల ఆరోపించారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్ ప్రకాశ్‌ను (praveen prakash) ఆకస్మికంగా ఢిల్లీ తరిమేశారని.. జగన్ వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. 

ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం వుందని...ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. జగన్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారని... రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని యనమల కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

కాగా.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గౌతమ్ సవాంగ్ (gowtham sawang) డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతుంది. 

అయితే గౌతం సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా.. జీఏడీలో రిపోర్ట్ చేయమనడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గౌతం సవాంగ్ పోస్టింగ్‌పై క్లారిటీ వచ్చింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు గౌతం సవాంగ్‌ను డీజీపీగా రిలీవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం సీఎం జగన్‌ను (ys jagan) ఆయన కలిశారు. 

ఇకపోతే .. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.  ఆయన గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగా కూడా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో  రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్