
ప్రత్యేకహోదా ఉద్యమంలో తెలుగుసినిమా పరిశ్రమ అడ్రస్ లేదు. కేవలం వర్ధమాన నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తప్ప మూడోవ్యక్తి ఎవరూ ఉద్యమంవైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. జల్లికట్టుకు తమిళ పరిశ్రమ మద్దతుగా నిలిస్తే ఇక్కడ మాత్రం తెలుగు సినీ పరిశ్రమ దూరంగా ఉండటం గమనార్హం.
దాంతోనే రాష్ట్రాభివృద్ధి విషయంలో తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో అందరికీ అర్ధమైంది. కేవలం సినిమాల్లో మాత్రమే తాము హీరోలమని, నిజ జీవితంలో సమాజం పట్ల తమకు ఏమాత్రం చిత్తశుద్దిలేదని పరిశ్రమ చెప్పకనే చెప్పింది. నిజంగా ఇది సిగ్గు పడాల్సిన విషయమే. మొదటి నుండి సినిమా పరిశ్రమ వర్గాలుగా విడిపోయింది. అందులో అధికార తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే వర్గం ఒకటి. మెగా కుటుంబానికి మద్దతుగా నిలిచే వర్గంతో పాటు పై రుండు వర్గాలకు దూరంగా వుండే వర్గం మరోటి.
అయితే, సినీ పరిశ్రమలో ఎన్నివర్గాలున్నప్పటికీ ప్రత్యేకహోదా అంశం రాష్ట్రం మొత్తానికి సంబంధించినది కాబట్టి ఉద్యమానికి మద్దతుగా నిలబడకపోతుందా అని జనాలు అనుకున్నారు. అయితే, వర్గ ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని పరిశ్రమ చాటి చెప్పింది. చంద్రబాబుకు మద్దతుగా నిలబడే వర్గానికి పరిశ్రమలో గట్టి పట్టే ఉంది. ఎందుకంటే, పరిశ్రమకు చెందిన మురళీమోహన్, మాగంటి బాబు తదితరులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇక, నందమూరి బాలకృష్ణ సంగతి చెప్పనే అక్కర్లేదు. అలాగే, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తదితరులు చంద్రబాబుకు బాగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి వారెవరూ పాల్గొనలేదు.
అదే సమయంలో చంద్రబాబు సామాజికవర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వర్గం కూడా బలంగానే ఉంది. అందులో మెగాస్టార్ చిరంజీవి సామాజికవర్గానిది ప్రముఖ పాత్ర. చిరంజీవి కుటుంబంలోనే పలువురు ప్రముఖులున్నారు. ఇన్ని రోజులూ ట్విట్టర్ ద్వారా యువతను రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ వర్గం ఉద్యమంలో పాల్గొంటుందని అనుకున్నారు. అయితే 26 ఉదయానికి సినిమా పరిశ్రమ నుండి ఎవరూ ఎక్కడా హాజరుకారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అదే సమయంలో ట్విట్టర్ ద్వారా యువతను రెచ్చగొట్టిన పవన్ కూడా చివరకు పత్తా లేకపోవటం పట్ల పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.