
పార్ట్ టైం రాజకీయ నాయకునికి, ఫుల్ టైం రాజకీయనాయకునికి తేడా ఏంటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద యువత క్యాండిల్ లైట్ ఉద్యమంలో పాల్గొంది. అందులో భాగంగానే విశాఖపట్నం ఆర్కె బీచ్ లో పెద్ద ఎత్తున యువత సిద్ధమైంది. ఉద్యమానికి మద్దతుగా తాను కూడా విశాఖకు వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని జగన్ ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే జగన్ విశాఖపట్నం వచ్చారు, అరెస్టయ్యారు.
అదే, పవన్ విషయం తీసుకుంటే, కేవలం ట్విట్టర్ లో మాత్రమే రెచ్చిపోయారు. విశాఖ బీచ్ లో కొవ్వొత్తుల ఉద్యమంలో పాల్గొనాలని పవన్ కూడా పిలుపిచ్చారు. అయితే, యువతకు చెప్పారే గానీ తాను విశాఖపట్నం వస్తానని మాత్రం చెప్పలేదు. దాంతో పవన్ ట్వీట్లు చూస్తున్న వారికి అనుమానాలు మొదలయ్యాయి. గతంలో లాగ కేవలం ట్వీట్లకు మాత్రమే పవన్ పరిమితమవుతారని అందరూ అనుమానిస్తున్నట్లుగానే జరిగింది.
జనసేనని జనాల్లోకి తీసుకెళ్లాలని, తనను తాను నిఖార్సైన రాజకీయ నేతగా నిరూపించుకునేందకు వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని పవన్ చేతులారా చెడగొట్టుకున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రత్యేకహోదా విషయంలో యువతను రెచ్చగొట్టిన పవన్ తో శనివారం రాత్రి నుండి తెలుగుదేశం ‘ముఖ్యు’లు చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది. దాని ఫలితంగానే విశాఖపట్నం వస్తారని అందరూ అనుకున్నా పవన్ మాత్రం పత్తా లేరు. కేవలం తెరమీద, ట్విట్టర్లో మాత్రమే పవన్ రాజకీయాలు చేద్దామని అనుకున్నారేమోనని అందరూ అనుమానిస్తున్నారు.
సినిమాల్లో కథానాయకునికి, నిజ జీవితంలో రాజకీయనాయకునికి తేడా ఏమిటో జగన్ చూపించారు. తాను వైజాగ్ వస్తే అరెస్టు తప్పదని తెలిసినా జగన్ విశాఖపట్నంకు వచ్చారు, అరెస్టయ్యారు. ఇదంతా రాజకీయంలో భాగమే అయినా చెప్పింది చేయకపోతే జనాలు రెండోసారి నమ్మరు. ఉద్యమాలను ట్విట్టర్లో కాకుండా కార్యాచారణలో చూపించేవారినే ప్రజలు కూడా నమ్ముతారన్న విషయాన్ని పవన్ ఎందుకో మరచిపోయినట్లు కనబడుతోంది.