యాప్ వివాదం.. కుదరని ఏకాభిప్రాయం, ఉపాధ్యాయ సంఘాలతో బొత్స చర్చలు విఫలం

By Siva KodatiFirst Published Aug 18, 2022, 7:59 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్ యాప్.. ఇతర అంశాలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా వుందని బొత్స సత్యనారాయణ తెలిపారు
 

యాప్ ఆధారిత అటెండెన్స్, ఇతరత్రా సమస్యలపై మంత్రి బొత్స సత్యనారాయణతో గురువారం ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా వుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫేస్ రికగ్నేషన్ యాప్‌ లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు  ఉపాధ్యాయులు. టీచర్ల అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. 

నిమిషం ఆలస్యమైతేప ఆబ్సెంట్ వేస్తారన్నది అవాస్తవమని.. 3 సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించడం పాత నిబంధనే అని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో కొత్త నిబంధనలు పెట్టలేదని.. ఫోటో అప్‌లోడ్, ఇంటర్నెట్ విషయాలకు సంబంధించి సాంకేతిక సిబ్బందితో మాట్లాడతామన్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ నెల 27 లేదా 28న మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. 

ALso Read:మేం స్కూల్స్ మూశామా.. ఒక్కటి చూపించండి : టీడీపీకి మంత్రి బొత్స సవాల్

ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌పై కమ్యూనికేషన్ గ్యాప్ వుందని.. 15 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తామని బొత్స పేర్కొన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఉపాధ్యాయులు ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. రాబోయే కాలంలో ఇతర విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చని మంత్రి సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో సెల్‌ఫోన్లు ఉద్యోగులవా లేక ప్రభుత్వమే ఇస్తుందా అనేది ఆయా శాఖల విచక్షణపైనే వుందన్నారు

దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతూ.. సొంత ఫోన్‌లలో ఫేస్ రికగ్నైషన్ యాప్‌కు ఒప్పుకునేది లేదని వారు తెలిపారు. సొంత ఫోన్‌లలో యాప్ డౌన్ లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. 

click me!