టిడిపి ఓటమితో మనస్థాపం... కార్యకర్త ఆత్మహత్యపై చంద్రబాబు భావోద్వేగం

Arun Kumar P   | Asianet News
Published : Feb 16, 2021, 12:04 PM ISTUpdated : Feb 16, 2021, 12:10 PM IST
టిడిపి ఓటమితో మనస్థాపం... కార్యకర్త ఆత్మహత్యపై చంద్రబాబు భావోద్వేగం

సారాంశం

ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి కట్టుగా పోరాడదామని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. 

గుంటూరు: పంచాయితీ ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలయ్యిందన్న మనస్థాపంతో అనంతపురం జిల్లాలో ఓ టిడిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు భావోద్వేగానికి గురికావద్దని సూచించారు.  మనో ధైర్యంతో అరాచక పాలనపై ముందుకెళ్దామని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి కట్టుగా పోరాడదామని, ఆత్మస్థైర్యాన్ని ఎవరూ కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. 

ఓటమిపై మనస్తాపంతో అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. నాగేంద్ర కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

READ MORE  పంచాయితీ ఎన్నికల్లో బుద్ది చెప్తున్నా... వైసిపి నేతలకు సిగ్గేది: చంద్రబాబు సీరియస్

ఇక పంచాయితీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను, నాయకులను బెదిరిస్తూ వైసిపి అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అయితే ఈ దౌర్జన్యకాండ మరీ ఎక్కువగా వుందని అన్నారు. ఈ జిల్లాలో వైసిపికి పోటీగా నిలిచిన ఇతర అభ్యర్ధులపై, వారి ఆస్తులపై దాడులకు తెగబడుతున్నారంటూ ఓ లేఖ ద్వారా ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.  

కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి తెగబడుతున్నారు. మౌఖికంగాను, భౌతికంగాను బెదిరింపులకు, దాడులకు దిగడం ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేస్తున్నారు.  నిన్న సోమవారం(2021 ఫిబ్రవరి 15న) పైడిపాలెం గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై దాడి జరిగిందన్నారు. 

''పైడిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు వైకాపాయేతర అభ్యర్థి శివ అంజనమ్మ నామినేషన్ దాఖలు చేశారు. తమకు పోటీగా నిలిచిన అంజనమ్మను వైసిపి నాయకులు బెదిరించారు. నామినేషన్ ఉపసంహరించుకోపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. ఆమె వ్యవసాయ క్షేత్రం యొక్క ఫెన్సింగ్‌ను పూర్తిగా నాశనం చేయడమే కాక పాక్షికంగా చిని పంటను నాశనం చేసారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చిని పంటను పూర్తిగా నాశనం చేస్తామన్నారట'' అని ఎస్ఈసి కి ఫిర్యాదు చేశారు. 

''అదే పైడిపాలెం గ్రామంలో వైకాపాయేతర మరొక అభ్యర్థి కటికా ఓబులమ్మను సర్పంచ్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. ఓబులమ్మ గ్రామంలో ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే ఆమె దుకాణంను కుల్చేస్తామని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరించారు. ఈ బెదిరింపులన్నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లు కిరణ్ రెడ్డి చేయిస్తున్నారు'' అని చంద్రబాబు ఆరోపించారు. 

''అభ్యర్థులు అంజనమ్మ మరియు కటికా ఓబులమ్మలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాను. భయం మరియు పక్షపాతం లేకుండా ఎన్నికలలో స్వేచ్ఛగా పోటీ చేయడానికి వారికి భద్రత కల్పించండి. అదే సమయంలో బెదిరింపులపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం చాలా అవసరం. ఎన్నికల సంఘం వేగవంతంగా స్పందించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది'' అంటూ చంద్రబాబు ఎస్ఈసికి రాసిన లేఖలో కోరారు.  

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu