చంద్రబాబు దీక్షకు సర్వం సిద్ధం: జనసేన సహా పలు పార్టీల మద్ధతు

By sivanagaprasad KodatiFirst Published Nov 13, 2019, 9:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత గురువారం నిరసన దీక్ష చేయనున్నారు. ఇందుకు సంబంధించి తెలుగుదేశం శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత గురువారం నిరసన దీక్ష చేయనున్నారు. ఇందుకు సంబంధించి తెలుగుదేశం శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. దీక్ష నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార గీతాన్ని సైతం విడుదల చేసింది.

ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న మాఫియాను అరికట్టాలని, భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు భృతి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించడం వంటివి టీడీపీ ప్రధాన డిమాండ్లు.

‘‘కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా’’ నినాదంతో విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షకు అన్ని పార్టీలు, వర్గాల మద్ధతు కూడగట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.

రేపు జాతీయ బాలల దినోత్సవం. కానీ ఏపీలో ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత కారణంగా కార్మికుల పిల్లలు ఫీజులు కట్టలేక బడి మానేశారు. కొంతమంది పిల్లలు తండ్రిని కోల్పోయారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్న బాధతోనే రేపు దీక్ష చేస్తున్నాను. pic.twitter.com/6tJdZnx1OK

— N Chandrababu Naidu (@ncbn)

ఇసుక దీక్షకు రెండు రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించింది. రాష్ట్రంలో ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న 60 మంది వైసీపీ నేతల పేర్లతో చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది.

అటు బాబు దీక్షకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. 

చంద్రబాబు నాయుడు దీక్షపై వివరించారు. చంద్రబాబు చేపట్టనున్న ఇసుక దీక్షకు మద్దతు పలకాలంటూ కోరారు. ఇసుక కొరతపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై చర్చించారు. 

Also Read:ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం

ఈ సందర్భంగా ఇసుక కొరతకి సంబంధించి ఎవరు నిరసన తెలిపినా జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మాజీమంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇసుక దీక్షకు మద్దతు ప్రకటించినందుకు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

కపోతే టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. మాజీ సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని కన్నా హామీ ఇచ్చారు.  

Also Read:దోస్త్ మేరా దోస్త్: చంద్రబాబు దీక్షకు పవన్ మద్దతు, దీక్షకు జనసైనికులు

ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపీనే అని ఆలపాటి రాజాకు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌కు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. 

ఇకపోతే ఇసుక కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వాస్తవమన్నారు. అందువల్ల ఏ పార్టీ అయినా సరే ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడితే తమ సంఘీభావం ఉంటుందే తప్ప పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు కన్నా లక్ష్మీనారాయణ.

రండి! చంద్రన్న దీక్షకు మద్దతుగా కదలండి. ఇసుక సమస్య పరిష్కారానికి అండగా నిలవండి. pic.twitter.com/ndsC7QFTi6

— Telugu Desam Party (@JaiTDP)
click me!