తిరుపతి అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల హల్ చల్... టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి

By Arun Kumar PFirst Published Oct 18, 2020, 12:22 PM IST
Highlights

తిరుపతి అడవుల్లో రెచ్చిపోయిన తమిళ స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వద్ద ఉన్న తుపాకులు చూసిన స్మగ్లర్లు పారిపోయారు.

టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు, లింగాధర్ టీమ్ లు శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి కరకంబాడీ అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో కరకంబాడీ రోడ్డులోని ఎల్ఐసి కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులో నుంచి కొంతమంది తమిళ స్మగ్లర్లు వారం రోజులకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలతో దిగారు. 

read more   ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిరోధించాలి - తంగిరాల సౌమ్య

అయితే కూంబింగ్ నిర్వమిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అటువైపు రావడంతో స్మగ్లర్లు ఒక్కసారిగా రాళ్లదాడికి దిగారు.   అయితే సిబ్బంది వద్ద వున్న తుపాకులను చూసి చీకట్లో కలిసిపోయారు. దాదాపు 75కిలోల బియ్యం, కందిపప్పు ఇతర నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, బీడీలు, టాబ్లెట్ లు ఇతర వస్తువులను వదిలి పారిపోయారు. 

సమాచారం అందుకున్న ఎస్పీ ఆంజనేయులు, డిఎస్పీ వెంకటయ్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్మగ్లర్లు పారిపోయిన వైపుకు ఒక టీమ్ ను పంపి గాలింపు  చేపట్టారు. ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ... స్మగ్లర్లను అడవుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో దాదాపు 70 నుంచి 80 ఎర్రచందనం చెట్లను కాపాడ గలిగామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!