పెద్దారెడ్డి పాదయాత్రలో కరపత్రాల కలకలం.. జేసీ పనేనన్న ఎమ్మెల్యే, చర్చకు రావాలంటూ సవాల్

By Siva KodatiFirst Published Jan 28, 2023, 2:25 PM IST
Highlights

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తాను పాదయాత్ర చేస్తుంటే.. ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దారెడ్డి చేస్తున్న పాదయాత్రలో కరపత్రాలు కలకలం రేపాయి. ప్రజలకు పెద్దారెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై భగ్గుమన్నారు. తాను పాదయాత్ర చేస్తుంటే.. ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికే కరపత్రాలు పంచుతున్నారని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 

ఇదిలావుండగా.. గత నెలలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్‌షీట్‌ను ప్రభాకర్ రెడ్డి మాయం చేశాడని ఆయన ఆరోపించారు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ఛార్జ్‌షీట్‌ను కనిపించకుండా చేశాడని పెద్దారెడ్డి అన్నారు. పోలీసులు, కోర్టు సిబ్బంది ప్రభాకర్ రెడ్డికి సహకరించారని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డికి నేరాలు చేయడం.. అధికారులపై వేయడం అలవాటంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఛార్జీ‌షీట్ మాయమైన విషయం పెద్దారెడ్డికి ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు. ఈ అంశం బయటకు ఎలా పొక్కిందో బయటకు బయటపెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జేసీ కోరారు. 

ALso REad: ఛార్జ్‌షీట్ మాయమైనట్టు ఆయనకెలా తెలుసు.. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్

కాగా.. గత నెలలో తాడిపత్రిలో సీబీఐ సోదాలు నిర్వహించిన  సంగతి తెలిసిందే. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జఠాదర ఇండస్ట్రీస్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జఠాధర ఇండస్ట్రీస్‌తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారుల ఎదుట ఇప్పటికే రెండు సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 

బీఎస్ 3 వాహనాలను స్క్రాప్స్ కింద కొని బీఎస్ 4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా జేసీ ట్రావెల్స్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వాటిలో చవ్వా గోపాల్ రెడ్డి పేరిట కొన్ని వాహనాలు వున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.

click me!