ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీతోనే జనసేన , మా హైకమాండ్‌తో పవన్ మాట్లాడారు : సుజనా చౌదరి

By Siva KodatiFirst Published Jun 1, 2023, 4:46 PM IST
Highlights

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జనసేన కలిసే ముందుకు సాగుతాయన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని ఆయన అన్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పుడే రాష్ట్రంలో రాజకీయాలు వేడక్కాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. సీఎం జగన్ ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో జనంలో వుంటూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ఇటీవల ముగిసిన మహానాడులో మినీ మేనిఫెస్టో పేరిట గ్యారెంటీ స్కీమ్‌లపై హామీలు ఇచ్చారు చంద్రబాబు. దీనికి ధీటైన మేనిఫెస్టోను సిద్ధం చేసేందుకు వైసీపీ సైతం కసరత్తు ప్రారంభించింది. 

ఇదిలావుండగా.. టీడీపీ - జనసేనల మధ్య దాదాపుగా పొత్తు ఖరారు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. తేలాల్సింది సీట్ల పంపకమేనని వారు చెబుతున్నారు. పవన్ కానీ, ఇతర జనసేన నేతలు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని అన్నారు. 

ALso Read: జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం

ఇరు పార్టీలు పొత్తులతోనే ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని.. ఏపీకి కేంద్రం సాయం చేసిందని సుజనా చౌదరి వెల్లడించారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాని ఆయన దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం.. ఏపీకి ఎయిమ్స్, కేంద్ర విద్యా సంస్థలు, జాతీయ రహదారులు మంజూరు చేసినట్లు సుజనా చౌదరి పేర్కొన్నారు. 
 

click me!