
ఏలూరు : హైవేపై దూసుకెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన దుర్ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 11మంది గాయపడ్డారు.
పోలీసులు, బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ నుండి విజయనగరంకు 25 ప్రయాణికులు, 3 డ్రైవర్లతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది.అయితే మంగళవారం తెల్లవారుజామున ఈ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు సమీపానికి చేరుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ బస్సు ప్రమాదంలో 11 మంది గాయపడగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
Read More అమెరికాలోని ఎయిర్ పోర్ట్ ప్రమాదంలో గుంటూరుకు చెందిన ఎన్ఆర్ఐ మృతి..
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలావుంటే ప్రకాశం జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. కొనకమమిట్ల మండలం పాతపాడు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.