
అందరూ అనుకున్నదే జరిగింది. కోళ్ళు గెలిచి..వ్యవస్ధలు ఓడాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఎత్తున కోళ్ళ పందేలు జరిగాయి. మామూలుగా అయితే ఇంత భారీ ఎత్తున కోళ్ల పందేలు జరగవు. కాకపోతే న్యాయస్ధానం పందేలను నిషేధించింది కాబట్టి క్రేజ్ పెరిగిపోయింది.
రాజకీయ పార్టీల నేతలందరూ కలిసి పోయినాక ఇక ప్రభుత్వాలైనా న్యాయవ్యవస్ధలైనా చేయగలిగేది మాత్రం ఏం ఉంటుంది? తమిళనాడులో జల్లికట్టు నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీలు న్యాయస్ధానాన్ని బహిరంగంగా వ్యతిరేకించగా, ఇక్కడ మాత్రం సరే సరే అంటూనే రాజకీయపార్టీలు తమ పని కానిచ్చేసుకుంటున్నాయి.
కోళ్ళపందేలు యధేచ్చగా జరుగుతున్నా పోలీసు వ్యవస్ధ చోద్యం చూస్తోంది కాబట్టే న్యాయవ్యవస్ధ కూడా చేతులెత్తేసింది. పలుచోట్ల అధికార పార్టీ ఎంఎల్ఏ, ఎంపిలే పందేలను ప్రారంభించినాక ఇక పోలీసులు మాత్రం ఏమి చేయగలరు. దాంతో గతంలో ఎన్నడూ లేనంత భారీ ఎత్తున కోళ్ల పందేలు జరిగాయి. అనధికార సమాచారం ప్రకారం మొదటి రోజే కనీసం రూ. 400 కోట్ల మేర పందేలు జరిగాయి.
పశ్చమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, అమలాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లో భారీ ఎత్తున కోళ్ల పందేలు యధేచ్చగా సాగాయి. అలాగే, ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల మారుమూల ప్రాంతాల్లో కూడా జరిగాయి. తొలుత కోళ్ళకు కత్తులు లేకుండానే పందేలు జరుపుతామని కొందరు నేతలు న్యాయస్ధానంలో చెప్పినా అదేమీ సాధ్యం కాలేదు. ఎందుకంటే, కోళ్లకు కత్తులు లేకుండా పందేలంటే మజా ఏం ఉంటుంది?
టిడిపి ప్రజా ప్రతినిధులు తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కరరావు, మాగంటి బాబు, జెసి దివాకర్ రెడ్డి తదితరులు కోళ్ల పందేలను స్వయానా ప్రారంభింటం గమానర్హం. పందెంరాయళ్లకు నగదు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు స్వైపింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేయటంతో ఎక్కడ కూడా డబ్బులకు ఇబ్బందులు రాలేదు. రాజకీయ పార్టీలన్నీ కలిసిపోతే వ్యవస్ధలు ఏవిధంగా నిర్వీర్యమవుతాయో జరుగుతున్న కోళ్ళ పందాలే ఉదాహరణ.